Bihar Caste survey: బిహార్‌లో బీసీలు 63 శాతం ఉన్నట్లు వెల్లడైంది. బిహార్‌లో కులగణన సర్వే నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు (OBCs), అత్యంత వెనుకబడిన తరగతులు (EBCs) కలిపి రాష్ట్ర జనాభాలో 63 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈ రిపోర్టును రాష్ట్ర డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ వివేక్‌ సింగ్‌ సోమవారం విడుదల చేశారు. తాజా నివేదిక ప్రకారం బిహార్‌ రాష్ట్ర జనాభా దాదాపు 13.07 కోట్లుగా ఉంది.  హిందువులు 81 శాతం, ముస్లింలు 17 శాతం ఉన్నారు. హిందువులు 10,71,92,958 మంది ఉన్నారు. ముస్లింల సంఖ్య 2,31,49,925గా  ఉంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 17 శాతం మంది ఉన్నారు. ముస్లింలతో పోలిస్తే హిందువుల సంఖ్య ఐదు రెట్లు ఎక్కువ. క్రైస్తవుల సంఖ్య 75,238, సిక్కులు 14753, బౌద్ధులు 1,11,201, జైనులు 12,523 మంది ఉన్నారు.






అలాగే జనాభాలో అత్యంత వెనుబడిన తరగతుల (EBCs) వారు 36 శాతం ఉన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల (OBCs) వారు 27.13 శాతం ఉన్నారు. కులాలవారీగా చూస్తే ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది. మొత్తం రాష్ట్ర జనాభాలో వీరి వాటా 14.27 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. షెడ్యూల్డ్‌ కులాల (SCs) జనాభా 19.7 శాతం, షెడ్యూల్డ్‌ తెగల (STs) జనాభా 1.7 శాతంగా నమోదైంది. జనరల్‌ కేటగిరీకి చెందినవారి జనాభా 15.5 శాతంగా ఉన్నట్లు తేలింది.






దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ గత ఏడాది జూన్‌లో ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో, రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, కులగణను వ్యతిరేకిస్తూ పట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ సర్వేకు అనుమతించింది. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది.


కులగణన నివేదిక నేపథ్యంలో.. అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నింటితో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సీఎం నీతీశ్‌ కుమార్‌ సోమవారం ఉదయం మీడియాతో అన్నారు. ఈ భేటీలో కులగణన నివేదికపై చర్చిస్తామన్నారు. ఓబీసీ కోటా పెంపు సహా ఇతరత్రా అంశాలపై సమాలోచనలు జరుపుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులతో కుల ఆధారిత జనాభా గణనను నిర్వహించాలని బీహార్ అసెంబ్లీలోని మొత్తం తొమ్మిది పార్టీలు నిర్ణయించాయని చెప్పారు. జనాభా గణనలో కులాలను వెల్లడించడమే కాకుండా ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితిగతుల గురించి కూడా సమాచారం ఇచ్చామని ఆయన అన్నారు.