Google Maps: సాంకేతికత మరోసారి రెండు ప్రాణాలను బలి తీసుకుంది. కేరళలో ఇద్దరు యువ డాక్టర్లు గూగుల్ మ్యాప్స్, జీపీఎస్‌ను నమ్ముకొని కారుతోపాటు ప్రాణాలుకోల్పోయారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో చోటు చేసుకొంది. వివరాలు.. కొల్లాంకు చెందిన డాక్టర్‌ అద్వైత్‌ (28), త్రిశూర్‌కు చెందిన డాక్టర్‌ అజ్మల్‌ (28) ఓ ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తున్నారు. కొడుంగల్లూరు ఆస్పత్రిలో విధులు ముగించుకొని శనివారం రాత్రి కారులో ఇళ్లకు బయల్దేరారు. వీరితోపాటు డాక్టర్‌ తబ్సిర్‌, ఎంబీబీఎస్‌ విద్యార్థిని తమన్నా, నర్స్‌ జిస్మాన్‌ సైతం కారులో ఎక్కారు. కారును డాక్టర్‌ అద్వైత్‌ నడిపారు. ఆదివారం అద్వైత్ పుట్టిన రోజు కావడంతో షాపింగ్‌ చేసి తిరుగు ప్రయాణమయ్యారు.


శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. రోడ్డు మార్గం సరిగా కనిపింకపోవడంతో అద్వైత్‌ గూగుల్ మ్యా్ప్స్‌లో జీపీఎస్‌ అనుసరించి డ్రైవింగ్‌ చేస్తున్నాడు. మధ్యలో ఒక సారి జీపీఎస్‌ రీ రూట్ అయ్యింది. పెరియార్ నదిలోకి దారి చూపించింది. దానిని అనుసరించిన అద్వైత్ నీరు నిలిచి ఉన్న ప్రాంతాన్ని రోడ్డుగా భ్రమించాడు. కారును నేరుగా నీటిలోకి తీసుకెళ్లాడు. అది నది అని గుర్తించేలోపే వారి కారు నీటిలో మునిగిపోయింది. అద్వైత్‌, అజ్మల్‌ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 


సమాచారం అందుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తబ్సిర్‌, తమన్నా, జిస్మాన్‌‌ను స్థానికులు రక్షించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  మ్యాప్‌లో సూచించిన విధంగా ఎడమవైపు మలుపు తీసుకోకుండా పొరపాటున ముందుకు వెళ్లి నదిలో పడిపోయినట్లు భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జీపీఎస్‌ సాధారణంగా తక్కువ ట్రాఫిక్‌ ఉన్న వైపు మార్గాన్ని సూచిస్తుంటుందని.. ఆ మార్గాలు అంత సరక్షితమైనవి కాదని నిపుణులు చెబుతున్నారు.


తెలంగాణలో ఇలాంటి ఘటనే..
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఇలాంటి ఘటనే సెప్టెంబర్ నెలలో జరిగింది. ఓ లారీ డ్రైవర్‌ను గూగుల్ మ్యాప్స్ తప్పుదారి పట్టించి ప్రాజెక్టులోకి తీసుకెళ్లి ముంచెసింది. తమిళనాడుకు చెందిన లారీ చేర్యాల మీదుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వెళ్తోంది. డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్యకు ఆ దారిపై సరైన అవగాహన లేకపోవడంతో.. ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ఆధారంగా గమ్యస్థానానికి వెళ్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నందారం స్టేజీ దాటిన తర్వాత గూగుల్ మ్యాప్స్ లో సూటిగా రోడ్డు కనిపించింది. 


దారి ఉందనుకుని ఆ లారీ డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. చీకటి కావడంతో చుట్టు పక్కల పరిసరాలు కనిపించకపోవడంతో అలాగే ముందుకు వెళ్లారు. వర్షాలు పడుతున్నాయి కదా రోడ్డుపై నీరు నిలిచాయేమో అనుకున్నారు. మరికొంత ముందుకు వెళ్లగానే లోతు పెరిగింది. క్రమంగా నీరు లారీ క్యాబిన్ వరకు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ముందు భాగం చాలా వరకు నీటిలో మునగడంతో లారీ ఆగిపోయింది. క్యాబిన్ లో ఉన్న శివ, మొండయ్య కిందకు దిగారు. పరిస్థితిని గమనించి లారీ అక్కడే వదిలి సమీపంలోని రామవరం గ్రామానికి వచ్చారు.


గ్రామస్థులకు తమకు జరిగిన పరిస్థితి గురించి, లారీ నీటిలో చిక్కుకోవడం గురించి చెప్పారు. దీంతో ఎంపీటీసీ లింగాల శ్రీనివాస్, గుటాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డితో పాటు గ్రామ యువకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీకి తాళ్లు కట్టి వెనక్కి లాగడంతో అతికష్టం మీద భారీ వాహనం నీటిలో నుంచి బయటకు వచ్చింది. నందారం స్టేజి వద్ద స్టాపర్లను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వాహనాలను బైపాస్ రోడ్డు ద్వారా దారి మళ్లించారు. అయితే భారీ వర్షాల వల్ల ఆ స్టాపర్లు పడిపోయాయి. ఎలాంటి సూచిక బోర్డులు లేకపోవడంతో ఆ విషయం తెలియని లారీ డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు.