Assam CM: బాల్య వివాహాల వంటి పద్ధతులను పక్కనబెట్టి తమను తాము సంస్కరించుకునేంత వరకు రాబోయే పదేళ్ల పాటు మియా ప్రజల ఓట్లు బీజేపీకి అవసరం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు నదీతీర ప్రాంతాల్లోని బెంగాలీ మాట్లాడే ముస్లిం ప్రజల ఓట్లు అక్కర్లేదని చెప్పుకొచ్చారు. మియా ప్రజల మద్దతు తనకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీకి ఉందని పేర్కొన్నారు. తమకు ఓటు వేయకుండానే, తమకు అనుకూలంగా నినాదాలం చేయవచ్చని చెప్పారు.
'బీజేపీ ప్రజా సంక్షేమం చేస్తుంది. అలాంటి బీజేపీకి మియా ప్రజలు మద్దతు ఇస్తారు. కానీ, వారు మాకు ఓటు వేయాల్సిన అవసరం లేదు. మాకు మద్దతు ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం లేదు. మియా ప్రజలు హిమంత బిస్వా శర్మకు, నరేంద్ర మోదీకి, బీజేపీకి అనుకూలంగా నినాదాలు చేయనివ్వండి' అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. మియా అనే పదాన్ని.. బెంగాలీ మాట్లాడే ముస్లింల యాసను సూచించడానికి ఉపయోగిస్తారు.
ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీకి ఓటు వేయవద్దని తానే మియా కమ్యూనిటీ ప్రజలను అభ్యర్థిస్తున్నట్లు అస్సాం సీఎం పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ, బాల్య వివాహాలు, ఛాందసవాదాన్ని అరికట్టేంత వరకు మియా ప్రజలు బీజేపీకి ఓటు వేయవద్దని హిమంత తెలిపారు. ఈ దురాచారాలను నిర్మూలించడానికి దాదాపు 10 ఏళ్ల సమయం పడుతుందని, అప్పటి వరకు మియా ప్రజలను ఓట్లు అడగబోమని చెప్పారు.
బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా నివసించే చాలా ప్రాంతాల్లో పాఠశాలలు లేవని విలేకరులు అస్సాం సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఆయా ప్రాంతాల్లో విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని హిమంత బిస్వా శర్మ హామీ ఇచ్చారు. మైనారిటీ విద్యార్థులకు చదువుకునే అవకాశం రాదని, రాబోయే రోజుల్లో మైనారిటీ ప్రాంతాల్లో 7 కళాశాలలను ప్రారంభిస్తామని హిమంత చెప్పుకొచ్చారు.
ముస్లిం ఓట్లు అక్కర్లేదని ఎన్నికల వేళ చెప్పిన హిమంత
అస్సాం శాసనసభ ఎన్నికల వేళ 2021 లోనూ హిమంత బిస్వా శర్మ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బెంగాల్ నుంచి వలస వచ్చిన మియా ముస్లింల ఓట్లు బీజేపీకి అక్కర్లేదని ఎన్నికల వేళ హిమంత వ్యాఖ్యానించారు. మియా ప్రజలను ముస్లింలలో అతివాదులుగా పేర్కొన్న హిమంత బిస్వా శర్మ.. అలాంటి వ్యక్తుల ఓట్లు అవసరం లేదని అన్నారు. మియా ముస్లింలు అస్సాం సంస్కృతిని, భాషను, భిన్నత్వంలో ఏకత్వాన్ని వారు బహిరంగంగానే సవాల్ చేస్తుంటారని అప్పుడు హిమంత ఆరోపించారు. తమను తాము మియాలుగా చెప్పుకునే వారంతా.. అస్సాం సంస్కృతి, భాషకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని హిమంత విమర్శించారు.
అందుకే మియా ముస్లింల ఓట్లతో తాను ఎమ్మెల్యే గెలవాలని కోరుకోవడం లేదని చెప్పారు. వారు వేసిన ఓట్లతో అసెంబ్లీలో కూర్చోలేనంటూ అప్పుడు హిమంత వ్యాఖ్యానించారు. మియాలుగా చెప్పుకునే ముస్లింలకు అస్సాం రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా టికెట్లు ఇవ్వబోదని, కాంగ్రెస్ కూడా టికెట్లు ఇవ్వొద్దని హిమంత 2021 లో ఎన్నికల ముందు సూచించారు. అయితే ఆ ఎన్నికల్లో మియా ముస్లింలకు మద్దతునిచ్చే ఏఐయూడీఎఫ్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే.