Uttarakhand Tunnel Rescue Operation:



రెస్క్యూ ఆపరేషన్..


ఉత్తరాఖండ్‌ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ (Uttarakhand Tunnel Rescue) కీలక దశకు చేరుకుంది. సిల్‌క్యారా సొరంగంలో (Silkyara Tunnel) చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు 11 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికా నుంచి ప్రత్యేకంగా డ్రిల్లింగ్ మెషీన్‌ తెప్పించి వర్టికల్ డ్రిల్లింగ్‌ చేపడుతున్నారు. నవంబర్ 17నే డ్రిల్లింగ్ మొదలైనా మెషీన్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా ఆపరేషన్‌కి బ్రేక్ పడింది. అప్పటి నుంచి వాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు. ఇప్పటి వరకూ రెస్క్యూ ఏజెన్సీలు...శిథిలాలకు 36 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేయగలిగాయి. 24 మీటర్ల మేర 900 mm పైప్స్‌ని ఇన్‌స్టాల్ చేశారు. 36 మీటర్ల మేర మరో 800 mm పైప్‌ని జొప్పించారు. వీటి ద్వారానే ఆక్సిజన్, ఆహారం అందిస్తున్నారు. వర్టికల్ డ్రిల్లింగ్‌కి (Vertical Drilling) అవసరమైన స్పేస్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదే సమయంలో నిలువుగా మరో బ్యాకప్ టన్నెల్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం కూలిపోయిన సొరంగం ఎంట్రెన్స్‌కి ఎడమ వైపున ఈ మైక్రో టన్నెల్‌ని తవ్వుతున్నారు. అయితే...ఇందుకు కొంత సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతానికైతే డ్రిల్లింగ్ ప్రాసెస్‌ కాస్త వేగం పుంజుకుందని అధికారులు చెబుతున్నారు. 


కార్మికుల ఫొటోలు..


సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ప్రస్తుతానికి సురక్షితంగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్లకు అవసరమైన ఆహారం అందిస్తున్నారు. నిన్న రాత్రి (నవంబర్ 21) కార్మికులకు వెజ్ పులావ్, చపాతీలు అందించారు. అందరినీ మెడికల్ సూపర్‌విజన్‌లో ఉంచారు. పది రోజుల్లో తొలిసారి కార్మికుల ఫొటోలను విడుదల చేశారు అధికారులు. endoscopic flexi camera ని పైప్‌లైన్‌లో ఇన్‌సర్ట్ చేర్చారు. వాళ్లు ఆరోగ్యంగానే ఉన్నారని కన్‌ఫమ్ చేసుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మూడు సార్లు కాల్ చేసి మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. కార్మికులకు అవసరమైన వెలుతురు, ఆక్సిజన్ ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.