ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలోని కెమ్రియా సౌర్ గ్రామానికి చెందిన దేవ్ రటూరి ఇప్పుడు చైనాలో గుర్తింపు పొందిన భారత సంతతికి చెందిన నటుడు. ఆయన ఇప్పుడు అక్కడి పుస్తకాల్లో పాఠ్యాంశంగా మారారు. స్ఫూర్తి దాయకమైన అతని కథను చైనీస్ పాఠ్యాంశంగా రాగ్-టు-రిచ్ కథగా బోధిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని కెమ్రియా సౌర్ గ్రామానికి చెందిన దేవ్ రటూరి అభిమాన హీరో బ్రూస్‌ లీ. ఆయన అడుగుజాడలను అనుసరించాలనే కోరికతో 1998లో  ముంబైలో పునీత్ ఇస్సార్ (‘మహాభారతం’లో దుర్యోధన్) వద్దకు ఒక హిందీ సినిమాలో పాత్ర కోసం ఆడిషన్‌కు వెళ్లాడు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు.  ఆ తరువాత ఉపాధి కోసం ఒక రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేయడానికి చైనా వెళ్లాడు. 18 ఏళ్ల తరువాత అతని విజయగాథ జియోన్ నగరంలో 7వ తరగతి విద్యార్థులకు పాఠంగా మారింది.  


దేవ్ సుదీర్ఘ పోరాటం
చైనీస్ చిత్ర పరిశ్రమలో పెద్దగా పేరు తెచ్చుకున్న దేవ్, తెహ్రీ గర్వాల్‌లోని రైతు కుటుంబంలో జన్మించాడు. కరాటే నేర్చుకున్నాడు. కుటుంబ పోషణకు ఢిల్లీలో 10 ఏళ్లపాటు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. కరాటే తదుపరి శిక్షణ కోసం చైనాకు వెళ్లే అవకాశం కోసం వెతుకుతున్నప్పుడు, రటూరి 2005లో చైనాలోని షెన్‌జెన్‌లోని భారతీయ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా ఉద్యోగం సంపాదించాడు.  నెలకు రూ.10,000 నెలవారీ జీతంతో రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో మాండరిన్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాలనే అతని కల ఆయన్ను స్థిరంగా ఉండనివ్వలేదు. రాత్రిపూట నన్ను మేల్కొనేలా చేసింది. అయితే, తదుపరి శిక్షణ కోసం చాన్ బౌద్ధమతానికి జన్మస్థలం షావోలిన్ టెంపుల్‌కి వెళ్లాలని అనుకున్నా అందుకు అతని ఆర్థిక స్తోమత సరిపోలేదు.   


అతనికి మరో మార్గం కనిపించలేదు. తర్వాత ఏడేళ్లు కష్టపడి ఉన్నత స్థాయి రెస్టారెంట్‌లో మేనేజర్ స్థాయికి ఎదిగాడు. 2013లో  జియాన్‌లో రెడ్ ఫోర్ట్ అనే సొంత రెస్టారెంట్‌ని తెరిచాడు. భారతదేశం సాంస్కృతిక వారసత్వం ఆధారంగా దీనిని రూపొందించాడు. అదృష్టం కొద్దీ, రటూరి 2017లో ఒకరోజు తన దగ్గర భోజనం చేసేందుకు వచ్చిన చైనీస్ దర్శకుడిని కలిశాడు. అతనికి SWAT అనే టీవీ సిరీస్‌లో చిన్న పాత్రను ఇచ్చారు. అది అదృష్టంలా పనిచేసింది. అప్పటి నుంచి, అతను 35 కి పైగా చైనీస్ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించాడు. ఇందులో అతను ప్రముఖ పాత్ర పోషించిన 'మై రూమ్‌మేట్ ఈజ్ ఏ డిటెక్టివ్' వంటి ప్రముఖమైనవి ఉన్నాయి. ఈ రోజు చైనాలో రటూరికి ఎనిమిది రెస్టారెంట్లు ఉన్నాయి. 


ఆయన చేసే పని చైనీస్ సినిమాలో పాపులర్ ఫేస్ అవ్వడానికి సహాయపడింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో స్థానికుల నుంచి అపారమైన ప్రేమ లభించిందని రటూరి చెబుతారు. వారు తనను సొంత మనిషిలా చూసుకున్నారని, వారి ప్రేమ వెలకట్టలేనిదని అంటారు.  ప్రస్తుతం రాటూరి తన భార్య అంజలి, ఇద్దరు కుమారులు, ఆరవ్(11), అర్నవ్‌(9)తో కలిసి జియాన్‌లో నివసిస్తున్నారు. ఎంత ఎదిగినా రాటూరి పుట్టిన ఉత్తరాఖండ్‌పై ప్రేమను మరిచిపోలేదు. తన ఊరు హృదయానికి దగ్గరగా ఉంటుందని అంటారు. తన గ్రామం నుంచి దాదాపు 150 మంది నిరుద్యోగులను చైనాకు తీసుకువచ్చాడు, వారికి ఉద్యోగాలు, అవకాశాలను కల్పించాడు. ఢిల్లీలో పని చేసే రోజుల్లో పరిచయమైన మనోజ్ రావత్ మాట్లాడుతూ.. రటూరి వద్ద సిబ్బంది మొత్తం 70 మంది కాగా వారిలో 40 మంది ఉత్తరాఖండ్‌కు చెందినవారు. మిగిలినవారు చైనీయులని అని చెప్పారు.