Heavy Rains: దేశరాజధాని ఢిల్లీలో భారీగా వర్షం కురుస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారు జామును ఉరుములు, మెరుపులతో కూడా పెద్ద వర్షం పడింది. దీంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులన్నీ జలదిగ్బంధం కాగా.. ట్రాఫిక్ స్తంభించిపోయింది. వందలాది కార్లు నీటిపై తేలియాడుతున్నాయి. పైన టాప్ తప్పితే ఏమీ కనిపింట్లేదు. దీంతో వాహన దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 






ఈ క్రమంలోనే ఢిల్లీ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు యమునా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. మంగళవారం ఉదయం 7 గంటలకు నదిలో నీటి మట్టం 205.45 మీటర్లుగా ఉంది. 






ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా, ఘజియాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎడతెరిపి లేని వర్షంతో రెండు నగరాలు అతలాకుతలం అయ్యాయి. ప్రధాన రహదారులు సహా కాలనీలన్నీ నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా హిండన్ నది నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో సమీపంలోని ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. నది నీటిమట్టం విపరీతంగా పెరగడంతో ఎకోటెక్ 3 సమీపంలోని ప్రాంతం పూర్తిగా వరదలో చిక్కుకుపోయింది. దీంతో చాలా వాహనాలు వరద నీటిలో మునిగి తేలియాడుతున్నాయి. ఇందుకు సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. 










తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు


తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగ నుంది. తెలంగాణలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతవరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.


ఏపీ విషయానికొస్తే అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.