Byju's: కరోనా కాలంలో బైజూస్‌ ఒక వెలుగు వెలిగింది. $22 బిలియన్ల విలువకు చేరి, స్టార్టప్‌ అంటే ఇలా ఉండాలంటూ భారత్‌తో పాటు, ప్రపంచ దేశాల స్టార్టప్స్‌ అన్నింటికీ ఒక మోడల్‌గా నిలిచింది. ఇప్పుడు, అదే కంపెనీ అథఃపాతాళానికి పడిపోతోంది. ఒకప్పుడు హీరో అని పిలిపించుకున్న బైజూర్ ఫౌండర్‌ & చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ రవీంద్రన్‌, ఇప్పడు తన కంపెనీని పతనం నుంచి కాపాడుకోవడానికి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 


అష్టకష్టాలంటే ఇవే..
ఏళ్ల తరబడి కష్టం, కంటెంట్‌, ప్లానింగ్‌తో ఎవరెస్ట్‌ స్థాయికి ఎదిగిన బైజూస్, అక్కడి నుంచి పడిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. కరోనా కాలంలో హైయెస్ట్ లెవల్‌కు వెళ్లి, తన పతనాన్ని అక్కడి నుంచే స్వహస్తాలతో రాసుకుంది. ఫారిన్‌ పెట్టుబడులు, లాభాలు వరదలా వచ్చి పడేసరికి, ఆ డబ్బును అక్రమంగా దాచుకోవడానికి బైజూస్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ అడ్డదార్లు తొక్కిందని రూమర్లు ఉన్నాయి. దీంతో, ఈ ఏడాది ఏప్రిల్ చివరలో, బైజూస్‌ బెంగళూరు ఆఫీస్‌ మీద సెంట్రల్‌ గవర్నమెంట్‌ తనిఖీలు చేశారు. ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎలాంటి కేసులూ నమోదు కాలేదు గానీ, అంతర్జాతీయ స్థాయిలో పరువు పోయింది.


2022, 2023 ఆర్థిక సంవత్సరాల ఫైనాన్షియల్‌ రిపోర్ట్స్‌ను ఈ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కంపెనీ గవర్నెన్స్‌ సరిగా లేకపోవడం, పెట్టుబడులు పెట్టి డైరెక్టర్ల సీట్లలో కూర్చున్న వాళ్ల మాటలు పట్టించుకోకపోవడంతో బైజూస్‌ నుంచి ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు. ఫైనాన్షియల్‌ రిపోర్ట్స్‌ ప్రకటించడంలో బైజూస్ ఆలస్యం చేస్తోందనే కారణంతో, ఈ సంస్థ ఆడిటింగ్‌ కంపెనీ 'డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్', గత నెలలో తప్పుకుంది. బైజూస్‌ బోర్డ్‌లో మెంబర్లుగా ఉన్న పీక్ XV, ప్రోసస్ NV, చాన్-జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ ప్రతినిధులు కూడా అదే వారంలో బైజూస్‌ బోర్డ్‌కు రిజైన్‌ చేశారు. ఐదు లక్షల డాలర్లను బైజూస్‌ దాచి పెట్టిందని ఆరోపిస్తూ కేసులు కూడా పెట్టారు.


బైజూస్ అకౌంట్‌ బుక్స్‌ను క్షుణ్నంగా పరిశీలించాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Corporate Affairs Ministry) ఇటీవల ఆర్డర్‌ పాస్‌ చేసినట్లు సమాచారం. ఆరు వారాల్లోగా రిపోర్ట్ సబ్మిట్‌ చేయాలని ఆదేశించినట్లు కూడా మార్కెట్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 


కరోనా తర్వాత కలిసి రాని కాలం
ఒక ప్రైవేట్ ట్యూటర్ స్థాయి నుంచి $22 బిలియన్ల కంపెనీకి నాయకుడిగా ఎదిగిన రవీంద్రన్‌... సీక్వోయా క్యాపిటల్, బ్లాక్‌స్టోన్, మార్క్ జుకర్‌బర్గ్ ఫౌండేషన్‌తో సహా ప్రపంచ పెట్టుబడిదార్లందరినీ ఆకర్షించాడు. మహమ్మారి సమయంలో, భారతదేశంలోని ఎడ్-టెక్ మార్కెట్‌లో ఎక్కువ భాగాన్ని హస్తగతం చేసుకున్నాడు. డబ్బు ఇచ్చిన ఉత్సాహంతో ప్రపంచవ్యాప్తంగా డజనుకు పైగా కంపెనీలను చిటికె వేసినంత సులభంగా కొన్నాడు. 


కానీ.. తరగతి గదులు తిరిగి తెరుచుకోవడం, బైజూస్‌ ఆర్థిక స్థితి గురించిన ఆందోళనలు కంపెనీ ప్రతిష్టను మంటగలిపాయి. కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నియామకంలో రవీంద్రన్‌ బాగా ఆలస్యం చేయడంపై గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ఆగ్రహంతో రగిలిపోయారు. స్కూళ్లు, కాలేజీలు ఓపెన్‌ కావడంతో వందల మంది ఉద్యోగులను తీసేయాల్సి వచ్చింది. బోర్డు సభ్యులు రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా చాలా బైజూస్‌ టీచింగ్‌ సెంటర్లలో ఈగలు తోలుకుంటున్నారు.


బైజూస్‌తో పాటు ఫౌండర్‌ రవీంద్రన్‌ కూడా నెలల తరబడి సంక్షోభంలో మగ్గుతున్నాడు. దీనికి పరిష్కారంగా, తన కంపెనీలోకి ఫండ్‌ రైజ్‌ కోసం దుబాయ్‌ వెళ్లి టాప్‌ ఇన్వెస్టర్లను కలుసుకున్నాడు. ఫారిన్‌ పెట్టుబడిదార్ల నుంచి $1 బిలియన్లు సమీకరించాలన్నది అతని టార్గెట్‌. బైజూస్‌ బ్యాలెన్స్‌ తప్పిందని, గవర్నమెంట్‌ కన్ను కంపెనీ మీద ఉందని విన్న పెట్టుబడిదార్లు, కొత్తగా ఒక్క డాలర్‌ కూడా విదల్చలేదు. దీంతో, తన కంపెనీని సమర్థిస్తూ రవీంద్రన్‌ కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.


మరో ఆసక్తికర కథనం: FPIల ఫేవరెట్ స్టాక్స్‌, గత ఏడాదిన్నరగా వీటిని కొనడం ఆపలేదు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial