Usha Chilukuri Vance Family History: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో జేడీ వాన్స్ భార్య తెలుగింటి అమ్మాయి ఉషా చిలుకూరి పేరు అమెరికాలోనే కాకుండా భారత్‌లోనూ మార్మోగిపోతోంది. ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఉషా తండ్రి రాధాకృష్ణ (క్రిష్), తల్లి పేరు లక్ష్మి. ఆమె పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వారు. ఆమె మూలాలు ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉన్నాయి. ఆమెకు తాత వరుసైన చిలుకూరి రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉంటుండగా.. ఉష పూర్వీకులు కృష్ణా జిల్లా నుంచి దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఆమె నానమ్మ, తాతయ్యలు కృష్ణా జిల్లాలోని పామర్రు నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. అనంతరం కొన్నేళ్లకు ఉషా చిలుకూరి తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి అమెరికాకు షిష్ట్ అయ్యారు. కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. ఉషా చిలుకూరి తండ్రి ఫిజీషియన్‌గా చేసి రిటైర్ అయ్యారు.
'చాలా సంతోషంగా ఉంది'
ఉష కుటుంబంలోని అంతా ఉన్నత విద్యావంతులే. ఆమెకు విశాఖలోనూ బంధువులు ఉన్నారు. ఆమెకు నానమ్మ వరుసయ్యే శాంతమ్మ విశాఖలోనే ఉంటున్నారు. తొమ్మిది పదుల వయసులోనూ ఆమె విద్యార్థులకు పాఠాలు చెబుతూ.. ఆమె పరిశోధనలు చేస్తున్నారు. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి. తెలుగు ప్రొఫెసర్‌గా చేసిన ఈయన.. కొన్నేళ్ల క్రితం మరణించారు. ఈయన సోదరుడు రామశాస్త్రి.. ఆయన కుమారుడు రాధాకృష్ణ శాస్త్రి. ఈయన సంతానమే ఉష. ఈ సందర్భంగా శాంతమ్మ ఏబీపీ దేశంతో మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె అక్కడే పుట్టి పెరగడంతో తమకు ఆమెతో పరిచయం తక్కువే. వాన్స్ అభ్యర్థిత్వం, తమ బంధుత్వం గురించి తెలిశాక పలువురు నాకు ఫోన్‌లో అభినందనలు తెలిపారు. మా బంధువులు అమెరికాలోని వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పని చేస్తున్నారు. ఉష దంపతులు ఈ స్థాయికి వెళ్లారని తెలియగానే సంతోషంగా, గర్వంగా అనిపించింది. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల తర్వాత వాన్స్ దంపతులు విశాఖ వస్తే కలుస్తాను' అని శాంతమ్మ ఏబీపీతో పేర్కొన్నారు. అటు, ఉషకు స్వయానా మేనత్త, చెన్నైలో వైద్యురాలిగా ఉన్న శారద కూడా ఆమెపై ప్రశంసలు కురిపించారు. వాన్స్ - ఉష దంపతుల వివాహం అమెరికాలో తెలుగు సంప్రదాయంలో జరిగిందని.. వారి వివాహానికి తాము హాజరైనట్లు చెప్పారు.
ఉషా వంశీయుల చరిత్ర
ఉషా పూర్వీకులు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురంలో నివసించారు. 18వ శతాబ్దంలో అక్కడ చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన సంతానమే తరాల తర్వాత ఉష వరకూ విస్తరించింది. ఉషా ముత్తాత వీరావధాన్లు, ఆయనకు రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్య శాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి అని ఐదుగురు సంతానం. వారంతా ఉన్నత విద్యావంతులే. రామశాస్త్రి ఐఐటీ మద్రాస్‌లో ప్రొఫెసర్, ఆయన భార్య బాలాత్రిపుర సుందరి. వీరికి అవధాని, నారాయణ శాస్త్రి, రాధాకృష్ణ.. ముగ్గురు కుమారులు. శారద అనే కుమార్తె ఉన్నారు. శారద ఉషా చిలుకూరికి మేనత్త. ముగ్గురు కుమారులూ అమెరికాలో స్థిరపడగా.. శారద చెన్నైలో ఉంటున్నారు. రాధాకృష్ణ ఏరో నాటికల్ ఇంజినీరింగ్ చేసి శానిడియేగో వర్శిటీలో పని చేస్తున్నారు. ఆయన పామర్రుకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరి సంతానమే ఉష.