Usha Chilukuri Vance: గడిచిన రెండు మూడు రోజులుగా ఇటు ఇండియాలోనూ.. అటు అమెరికాలోనూ ఎక్కువగా చర్చిస్తోన్న పేరు ఉషా చిలుకూరి వాన్స్. రిపబ్లికన్ పార్టీ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భార్య ఉషాకు (USHA CHILKURI VANCE) తెలుగు మూలాలు ఉండటంతో ఇక్కడ కూడా ఆమె గురించి ఆసక్తి ఉంది. ఉషా చాలా చురుకుగా ఉండేదని .. ఇక్కడి సంస్కృతిపై ఎంతో ఆసక్తి ఉందని ఆమెకు సంబంధించిన విషయాలను ఉష మేనత్త శారద ఏబీపీ దేశంతో పంచుకున్నారు. 


తెలుగింటి అల్లుడు D.J Vance,  మనమ్మాయి Usha Chilukuri Vance  ఇప్పుడు మీడియాలో వీళ్ల గురించే చర్చ. అమెరికాలో తెలుగువాళ్లు స్థిరపడటం, పై స్థాయికి చేరుకోవడం కొత్త కాకపోయినా.. ఏకంగా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఫ్యామిలీకి తెలుగు లింక్ ఉండటం అన్నది ఆసక్తి రేపింది. Ohio సెనేటర్ D.J Vance ను రిపబ్లికన్ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయనతో పాటు ఆయన సహచరి ఉషా చిలుకూరి వాన్స్ గురించి కూడా మీడియా ఎక్కువగా ఫోకస్ చేసింది. U.Sలోని ప్రముఖ పత్రికలన్నీ ఉషా గురించి రాశాయి. తెలుగు మీడియా కూడా వాళ్ల పూర్వీకుల గురించి ఆరా తీస్తోంది. ఏబీపీ దేశం ఆమె చెన్నైలో ఉండే ఆమె మేనత్త శారదతో మాట్లాడింది. ఆవిడ చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. 


'ఉష సరదా అమ్మాయి- లక్ష్యంపై ఫోకస్ ఉండేది'


ఇప్పుడు తెలుగు వారందరూ మాట్లాడుకుంటున్న ఉష గురించి ఆమె మేనత్త శారద గుర్తు చేసుకున్నారు. చెన్నైలో డాక్టర్‌గా ఉన్న శారద, ఉష తండ్రి రాధాకృష్ణకు స్వయానా అక్క. ఉషా వాళ్లు చిన్నప్పుడు పలుసార్లు చెన్నైకు వచ్చినట్లు ఆమె చెప్పారు. 'చిన్నతనంలో తను చాలా సరదాగా ఉండేది. అదే సమయంలో చాలా ఫోకస్డ్‌గా కూడా ఉండేదని.' ఏబీపీ దేశంతో  అన్నారు. ఉష వాళ్ల అమ్మమ్మ ఫ్యామిలీ కూడా చెన్నైలోనే ఉండేవారు. 'తను చిన్నప్పుడు ఇండియాకు వచ్చినప్పుడు... మూడు నాలుగుసార్లు మా ఇంటికి  వచ్చింది. నాతో చాలా చనువుగా ఉండేది' అని ఆమె గుర్తు చేసుకున్నారు. ఉష మంచి చదువరి అని పుస్తకాలు ఎక్కువగా చదివేదని శారద చెప్పారు. 'నేను  చిన్నతనంలో తనకు ఆర్.కె.నారాయణ్, రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు ఇచ్చి చదవమనే దానిని.. వాటినే కాదు.. ఏ బుక్స్ అయినా కూడా తను బాగా చదివేది' అని శారద చెప్పారు. తను తెలుగు బాగా మాట్లాడలేదు కానీ మనం మాట్లాడేది బాగానే అర్థం అవుతుందని వెల్లడించారు. 


హిందూ సాంప్రదాయంలో పెళ్లి


ఉషా చిలుకూరి యేల్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివేప్పుడు DJ వాన్స్ పరిచయం అయ్యారు. 2014లో వాళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. ఉషా కుటుంబం హిందూ సాంప్రదాయాలను చాలా నిష్టగా పాటించే బ్రాహ్మణ ఫ్యామిలీ. ఇంట్లో ఆ సంస్కృతి, సాంప్రదాయాలను బాగా పాటిస్తారు. అందుకే ఆమె వివాహం కూడా హిందూ పద్ధతిలోనే జరిగింది. వాళ్లిద్దరి వివాహ ఫోటోలను చూస్తే.. చాలా సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగిందని తెలుస్తుంది. ఉష పెళ్లికి తాను హాజరయ్యానని హిందూ వివాహంతో పాటు.. అమెరికాలోని సిస్టమ్ ప్రకారం సివిల్ మ్యారేజీ రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని చెప్పారు. ఉషకు మొదటి నుంచి రాజకీయ ఆలోచనలు, లక్ష్యాలు ఉన్నాయా అని ప్రశ్నించినప్పుడు.. 'అలాంటివేం లేవు ఇది అలా జరిగిందంతే..' అని ఆమె చెప్పారు. వాన్స్ తన డ్రైవింగ్ ఫోర్స్ ఉషనే అని చెప్పిన విషయాన్ని గుర్తు చేయగా.. 'వాళ్లిద్దరూ మంచి అవగాహనతో ఉంటారు. కానీ ఉషకు పోలిటికల్ యాంబిషన్స్ ఉన్నాయని నేను గుర్తించలేదు. తను ఎక్కువుగా చదువుపై ఫోకస్డ్‌ గా ఉండేది' అని చెప్పారు. అకడమిక్ లక్ష్యాలు చేరుకోవడంపై చాలా దృష్టి పెట్టేది. అందుకే తను తన లీగల్ ప్రొఫెషన్‌లో కూడా చాలా ఉన్నతమైన సుప్రీం కోర్టు లా క్లర్క్ పొజిషన్‌లో కూడా పని చేసిందన్నారు. 


తమ కుటుంబం పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు దగ్గరున్న వడ్డూరు ప్రాంతం నుంచి వచ్చిందన్నారు. ఈ కుటుంబంలో అందరూ కూడా ఉన్నత విద్యావంతులే. తొలితరంలోని వారంతా సంస్కృత విధ్వాంసులు. శారద, రాధాకృష్ణల తండ్రి రామశాస్త్రి మద్రాస్ ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. శారద, ఉష తండ్రి రాధాకృష్ణ చెన్నైలోనే పెరిగారు.  రాధాకృష్ణ ఇంజినీరింగ్ పూర్తైన తర్వాత యు.ఎస్‌లో ఎంఎస్‌ చేశారు. ఉష తల్లి లక్ష్మి కూడా చెన్నైలోనే మాలిక్యులర్ బయాలజీ చదువుకున్నారు.  లక్ష్మితో వివాహం తర్వాత అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. అక్కడే ఉషా జన్మించింది. ఆమె శానిడియాగోలో పుట్టి పెరిగారు. ఆ తర్వాత యేల్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం, కేంబ్రిడ్జ్‌లో మోడరన్ హిస్టరీలో ఎంఫిల్ చేశారు.