UPSC 2021: ఎంతో మంది ఎన్నో కలలతో సివిల్స్‌కి ప్రిపేర్ అవుతుంటారు. ఎంతో మంది పోటీ పడే ఈ పరీక్షల్లో అర్హత సాధించడం అంత ఈజీ కాదు. అర్హత సాధించిన విజేతల కథలు వింటే మనకు ఇది అర్థమవుతుంది. కానీ కొంతమంది మాత్రం త్రుటిలో ఛాన్స్ మిస్సవుతారు. అలాంటివారి బాధ వర్ణనాతీతం. అలాంటి ఒక ఆశావహుడు చేసిన ట్వీట్ తాజాగా వైరల్ అవుతోంది.
తన 10 ఏళ్ల కష్టాన్ని, ఆరుసార్లు చేసిన ప్రయత్నాన్ని వివరిస్తూ రజత్ సంబ్యాల్ అనే UPSC ఆశావాహుడు చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
నెటిజెన్ల మద్దతు
10 ఏళ్ల నుంచి తాను పడ్డ కష్టం బూడిద పాలైనా మరో ప్రయత్నానికి సిద్ధమంటూ ఆయన సంకేతాలు ఇచ్చారు. సంబ్యాల్‌కు UPSCలో 942 మార్కులు వచ్చాయి. దీనికి సంబంధించిన రిపోర్ట్ కార్డ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆయన షేర్ చేశారు. సంబ్యాల్‌కు నెటిజెన్లు మద్దతుగా నిలిచారు. వచ్చే పరీక్షలో సంబ్యాల్ తప్పకుండా ర్యాంక్ కొట్టాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ఫలితాలు
సివిల్స్- 2021 ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాల్లో శృతి శర్మ టాపర్‌గా నిలిచారు. 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ. అంకితా అగర్వాల్ రెండో ర్యాంక్, గామిని సింగ్లా 3వ ర్యాంక్, ఐశ్వర్య వర్మ 4వ ర్యాంకు, ఉత్కర్ష్ ద్వివేది 5వ ర్యాంక్ సాధించారు. సివిల్ సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు సత్తా చాటారు. టాప్-5లో ముగ్గురు అమ్మాయిలే కావడం విశేషం.
జనరల్ కోటాలో 244, ఈడబ్ల్యూఎస్ 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఎంపికయ్యారు. ఐఏఎస్‌కు 180 మంది, ఐపీఎస్‌కు 200 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరీకి 242 మంది, 90 మంది గ్రూప్ బీ సర్వీసులకు ఎంపికయ్యారు.
Also Read: UPSC 2021: ఎంత పనిచేశారు భయ్యా! ఐశ్వర్య అంటే అమ్మాయ్ అనుకున్నాంగా!
Also Read: Hurricane Agatha: మెక్సికోలో 'అగాథ' హరికేన్ బీభత్సం- 10 మంది మృతి