Rahul Ladakh Trip:
రాహుల్ బైక్‌రైడ్..
రాహుల్ గాంధీ లద్దాఖ్ ట్రిప్‌కి సంబంధించిన బైక్ రైడ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ రాహుల్‌ని జననాయక్ అని క్యాప్షన్‌లు పెడుతూ వరుస పోస్ట్‌లు పెడుతోంది. కేంద్రమంత్రులు కూడా రాహుల్‌కి థాంక్స్ చెబుతున్నారు. లద్దాఖ్ పర్యాటకంగా ఎంత అభివృద్ధి చెందిందో ప్రపంచానికి చాటి చెబుతున్నందుకు ధన్యవాదాలు అంటూ సెటైర్లు వేస్తున్నారు. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు...ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రధాని మోదీ హయాంలో లద్దాఖ్‌లో రహదారి సౌకర్యం వచ్చిందని చెబుతూనే అంతకు ముందు ఆ ప్రాంతం ఎలా ఉండేదో ఓ వీడియో పోస్ట్ చేశారు. కాంగ్రెస్‌కి చురకలు అంటించారు. ఈ వీడియో 2012లోది. అంటే అప్పటికి కాంగ్రెస్ అధికారంలో ఉంది. లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సుకి చేరుకునే దారి అప్పుడు రాళ్లతో నిండిపోయి ఉంది. ఓ SUV ఆ రూట్‌లో వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ వీడియోని షేర్ చేస్తూ...ఇప్పుడు రాహుల్ రైడ్ చేసిన దారిని పోల్చుతూ...సెటైర్లు వేశారు.
"ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో లద్దాఖ్‌లో నిర్మించిన రహదారులను ప్రమోట్ చేస్తున్న రాహుల్ గాంధీకి థాంక్స్. కశ్మీర్ లోయలోనూ టూరిజం అభివృద్ధి చెందుతోందని ప్రచారం చేస్తున్నందుకూ థాంక్స్. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ఇప్పుడు ప్రశాంతంగా మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేయచ్చు"
- కిరణ్ రిజిజు, కేంద్రమంత్రి
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా రాహుల్ బైక్‌రైడ్‌పై స్పందించారు. రాహుల్ స్వయంగా వచ్చి ఇక్కడి టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నారని అన్నారు.
"ఆర్టికల్ 370 రద్దు చేసిన తరవాత కశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా రాహుల్ గాంధీ ప్రమోట్ చేస్తుండటం సంతోషం. ఆయన రోడ్ ట్రిప్ ఫొటోలు, వీడియోలు చూసి చాలా సంతోషించాం"
- ప్రహ్లాద్ జోషి, కేంద్రమంత్రి
కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో ఉన్నారు. అక్కడి ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన..ఆ తరవాత రాజకీయాల్ని పక్కన పెట్టేశారు. ఓ ఎంపీగా కాకుండా ఓ సాధారణ పౌరుడిగా బైక్ రైడ్ చేయాలని అనుకున్నారు. అందుకే...లద్దాఖ్‌లోని పాంగాంగ్ లేక్ వరకూ బైక్‌పై వెళ్తున్నారు. తన రైడ్‌కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు రాహుల్. ఇందులో ఆయన చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ప్రో రైడర్ లుక్‌లో KTM 390 Adventure బైక్ నడుపుతున్నారు. మరి కొందరు రైడర్స్ ఆయనను ఫాలో అవుతున్నారు. హెల్మెట్, గ్లోవ్స్, రైడింగ్ బూట్స్, జాకెట్‌తో రైడ్‌ని ఎంజాయ్ చేశారు.
"పాంగాంగ్ లేక్‌కి బైక్‌రైడ్ చేస్తూ వెళ్తున్నాను. ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశం అదే అని మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
Also Read: రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన రాహుల్, తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ వీడియో