Rahul Gandhi: 


లద్దాఖ్‌లో నివాళి..


లద్దాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ...తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీకి ఎంతో ఇష్టమైన పాంగాంగ్‌ లేక్‌ తీరంలోనే ఆయన ఫొటో పెట్టి పూల మాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. నాన్నతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ స్పెషల్ వీడియో కూడా పోస్ట్ చేశారు. 






"నాన్న. నువ్వు కన్న కలలన్నీ మాకు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. మీరు చెప్పిన మాటలే నాకు దారి చూపుతున్నాయి. ప్రతి పౌరుడి కలల్ని, కష్టాల్ని అర్థం చేసుకోగలుగుతున్నానంటే అది మీ వల్లే. భరత మాత గొంతకనూ వింటున్నాను"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ 






పాంగాంగ్‌ లేక్ వరకూ బైక్‌ రైడ్..


పాంగాంగ్‌ సరస్సు వరకూ బైక్‌రైడ్ చేస్తూ వచ్చారు రాహుల్. తనకు ఇష్టమైన KTM బైక్‌పై ప్రయాణించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తరవాత చైనా ప్రస్తావన తీసుకొచ్చారు. భారత భూభాగంలో ఒక్క ఇంచు కూడా చైనా ఆక్రమించలేదని ప్రధాని మోదీ చెబుతున్నా..ఇక్కడ పరిస్థితులు అలా లేవని అన్నారు రాహుల్. ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. లద్దాఖ్‌లో పదేపదే చైనా సైనికులు అక్రమంగా చొరబడుతున్నారని, ప్రధాని మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 


"చైనా మన భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఇక్కడి ప్రజలే చెబుతున్నారు చైనా సైన్యం వచ్చి ఆక్రమిస్తోందని. ప్రధాని మోదీ మాత్రం ఇంచు భూమి కూడా ఆక్రమణకు గురి కాలేదని చెబుతున్నారు. కానీ ఇది నిజం కాదు. ఇక్కడ ఎవరిని అడిగినా వాస్తవమేంటో అర్థమైపోతుంది"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ


కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా ఢిల్లీలోని వీర్‌భూమి వద్ద రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.