PM Modi On Krishnam Raju Death: టాలీవుడ్ ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మరణం పట్ల సినీ ప్రముఖలతో పాటు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. "శ్రీ యూవీ కృష్ణం రాజు గారి మరణం నాకెంతో బాధ కలిగించింది. సినిమా రంగానికి ఆయన అందించిన సేవల్ని ముందు తరాలు గుర్తుంచుకుంటాయి. రాజకీయ నాయకుడిగానా ఆయన తనదైన ముద్రవేశారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి" అని ట్విటర్ వేదికగా ప్రధాని సంతాపం తెలిపారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం స్పందించారు. కృష్ణంరాజు ఇక లేరని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు. అద్భుతమైన నటుడు, సమాజ సేవతో సైతం ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అమిత్ షా అన్నారు. కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రసీమకు తీవ్ర లోటునువ మిగిల్చిందన్నారు.
ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున 3.25 గంటలకు ఆయన కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. తెలుగు వెండితెరపై హీరోగా ప్రేక్షకులను మెప్పించిన కృష్ణంరాజు.. అనంతరం రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఐఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దిగ్గజ నటుడు కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు.
‘కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మరణం చాలా విచారకరం. సినిమాల్లో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆయన. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు’ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.
బీజేపీకి, సినీ పరిశ్రమకు తీరని లోటు: కిషన్ రెడ్డి
ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇకలేరన్న విషయం తెలిసి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఏపీ తరఫున బీజేపీకి ఆయనతో కలిసి పనిచేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ప్రముఖ నటుడు మాత్రమే కాదు, గొప్ప మనసున్న వ్యక్తి ఆయన. కృష్ణంరాజు మరణం బీజేపీకి, తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు కానుంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు కిషన్ రెడ్డి. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు.
ప్రముఖ చలనచిత్ర నటుడు, మాజీ కేంద్రమంత్రి రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటు అని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. కథానాయకుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా వెలుగు వెలిగిన కృష్ణం రాజు సేవలు మరువలేనివి అని ట్వీట్ చేశారు.