Uniform Civil Code: 



వర్షాకాల సమావేశాల్లో బిల్‌ 


యూనిఫామ్ సివిల్ కోడ్‌ (UCC) బిల్‌ని ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెడతారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు ఇదే విషయం చెబుతున్నాయి. జులైలో వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. అప్పుడే దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కేబినెట్ కమిటీ మీటింగ్‌లో డిసైడ్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం...Uniform Civil Code Bill ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపనుంది. దీనిపై అందరి అభిప్రాయాలూ తెలుసుకుంటుంది. ఆ తరవాతే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ప్రధాని నరేంద్రమోదీ దీనిపై ప్రకటన చేసినప్పటి నుంచే విపక్షాలు మండి పడుతున్నాయి. ఇక పార్లమెంట్‌లో బిల్‌ని తీసుకొస్తే ఇంకెంత వాగ్వాదం జరుగుతుందో చూడాల్సి ఉంది. కాంగ్రెస్‌తో సహా పలు ముస్లిం సంఘాలు UCCని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే...లా కమిషన్,కేంద్ర న్యాయ శాఖకు చెందిన ప్రతినిధులతో జులై 3వ తేదీన పార్లమెంటరీ కమిటీ సమావేశం కానుంది. ఈ మేరకు ఇప్పటికే వాళ్లకు కబురు పంపింది. ఈ నెల 14వ తేదీనే వాళ్లకు పిలుపు అందినట్టు తెలుస్తోంది. జులై మూడో వారంలో వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. కొత్త పార్లమెంట్ భవనంలోనే ఇవి జరగనున్నాయి. 


తొలిసారి ప్రస్తావన..


భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం, సమాన హక్కులు ఉండాలని చెబుతోందని అలాంటి దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(ఏకరూప చట్టం)  అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ లో పర్యటించిన మోదీ తొలిసారి బహిరంగంగా యూనిఫాం సివిల్ కోడ్ పై స్పందించారు. ఒకే కుటుంబంలోని వేర్వేరు సభ్యులకు వేర్వేరు నిబంధనలు ఉండటం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రధాని ఇవాళ మధ్యప్రదేశ్ లో 'మేరా బూత్ సబ్సే మజ్‌బూత్' ప్రచారంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. త్రిపుల్ తలాక్ ఇస్లాం నుంచి విడదీయరానిదే అయితే.. ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్ వంటి ముస్లిం మెజారిటీ ఉన్న దేశాల్లో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. సిరియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లో కూడా త్రిపుల్ తలాక్ పాటించడం లేదని తెలిపారు. 90 శాతం సున్నీ ముస్లింలు ఉన్న ఈజిప్టు.. 80- 90 ఏళ్ల క్రితం నుంచే త్రిపుల్ తలాక్ ను రద్దు చేసిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు.


ముస్లిం సంఘాల వాదన..


చాలా రోజులుగా దీనిపై వాగ్వాదం నడుస్తున్నప్పటికీ...ప్రధాని మోదీ ప్రకటనతో అది మరింత ముదిరింది. ముఖ్యంగా ముస్లిం సంఘాలు దీనిపై తీవ్ర వ్యతిరేక వ్యక్తం చేస్తున్నాయి. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను బట్టే అది అర్థమవుతోంది. కాంగ్రెస్‌ కూడా గట్టిగానే వ్యతిరేకిస్తోంది. "ఇది కేవలం ఎన్నికల స్టంట్" అని విమర్శిస్తోంది. "ముస్లింలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బహుశా వాళ్లనెవరో మిస్‌లీడ్ చేస్తుండొచ్చు" ప్రధాని మోదీ పరోక్షంగా కొన్ని సంఘాలపై విమర్శలు చేశారు. కానీ...అటు ముస్లింలు మాత్రం దీన్ని అమలు కానివ్వం అని శపథం చేస్తున్నారు.  Muslim Personal Law Board వీటిని అమలు చేస్తుంది. ఇప్పటికే ట్రిపుల్ తలాఖ్ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడంపైనే అసహనం వ్యక్తం చేస్తున్నాయి పలు ముస్లిం సంఘాలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చట్టాలు మారినా...షరియా చట్టంలో మార్పులు తీసుకురావడం అంత సులభం కాదని తేల్చి చెబుతున్నాయి. యూసీసీ అమల్లోకి వస్తే ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌ ఉనికికే ప్రమాదమనీ వాదిస్తున్నాయి. అంటే...నేరుగా ముస్లింల హక్కులని అణిచివేయడమే అవుతుందని తేల్చి చెబుతున్నాయి. 


Also Read: Fake ED Officers: ఈడీ అధికారులమంటూ ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు, రూ.2కోట్లతో జంప్