Unesco Report: మనిషికి గాలి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. కొన్ని రోజుల పాటు మనిషి ఆహారం లేకుండా జీవించగలడేమో కానీ నీళ్లు లేకుండా మాత్రం ఉండలేడు. అయితే ఇప్పటికే మన దేశంలోని చాలా రాష్ట్రాలు, ప్రాంతాల్లో ప్రజలు నీటి కొరత సమస్యలను ఎదుర్కుంటున్నారు. కొన్ని కిలో మీటర్ల దూరం నడిచి వెళ్లి మరీ తాగేందుకు నీటిని తెచ్చుకుంటున్నారు. వేసవి కాలంలో అయితే నీటి సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇలాంటి సమయంలోనే యునెస్కో ఓ విషయాన్ని వెల్లడించి భారతీయుల గుండెల్లో బాంబు పేల్చింది. మరో పాతికేళ్ల తర్వాత అంటే 2050 నాటికి భారతదేసం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కుంటుందని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్ మెంట్ అనే నివేదికలో తెలిపింది. ప్రపంచ పట్టణ జనాభా రోజురోజుకూ పెరుగుతుండడంతో.. 2016నో దాదాపు 90 కోట్ల మంది ప్రజలు నీట సమస్యను ఎదుర్కున్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి ఈ సంఖ్య పెరుగుతూనే వస్తుందట.


ఇలాగే పెరుగుతూ వెళ్తే 2050 నాటికి ఈ సంఖ్య 170 కోట్ల నుంచి 240 కోట్ల వరకు చేరుకుంటుందని యునెస్కో అంచనా వేసింది. దీని వల్ల భారత్ తీవ్రంగా నీటి ప్రభావాన్ని చవిచూస్తుందని వెల్లడించింది. ప్రపంచ నీటి సమస్యను నివారించేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆండ్రీ ఆజూలై తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని యునెస్కో తన నివేదికలో వివరించింది. దాదాపు ఆసియాలోనే 80 శాతం మంది నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని వివరించింది. ముఖ్యంగా చైనాలోని ఈశాన్య ప్రాంత ప్రజలు, భారత్, పాకిస్థాన్ ప్రజలు ఎక్కువగా నీటి ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారి పేర్కొంది. ప్రస్తుతం 153 దేశాలు దాదాపు 93 నదులు, సరస్సులు, జలాశయ వ్యవస్థలను పంచుకుంటున్నాయన్నారు. అందులో సగానికి పైనా ఒప్పందం చేసుకున్నవవే ఉన్నాయని ఆ నివేదిక చీఫ్ ఎడిటర్ రిచార్ట్ కాన్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో కచ్చితంగా ప్రపంచం నీటి సమస్యలను ఎదుర్కుంటుందని హెచ్చరించారు. ఈ ఆందోళనలు నివారించేందుకు ప్రపంచ దేశాలు సరిహద్దుల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు.