Rahul Gandhi Defamation Case:
ట్వీట్ చేసిన రాహుల్
పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. మహాత్మా గాంధీ కొటేషన్‌ని కోట్ చేస్తూ ట్వీట్ చేశారు. "నిజం, అహింస. ఇవే నా మతం. నిజమే నాకు దైవం" అని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తిని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. రాహుల్‌కు మద్దతుగా కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. బీజేపీయేతర పార్టీలకు చెందిన నేతలపై ఏదో ఓ కుట్ర చేస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్‌తో విభేదాలున్నప్పటికీ...ఈ విషయంలో మాత్రం రాహుల్‌కు అండగా నిలబడతామని వెల్లడించారు.
"నాన్ బీజేపీ నేతలపై కుట్ర జరుగుతోంది. ఏదో విధంగా వారిపై అభియోగాలు మోపుతున్నారు. కాంగ్రెస్‌తో మాకు విభేదాలున్న మాట వాస్తవమే అయినా...రాహుల్ గాంధీకి ఇలా శిక్ష విధించడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిపక్షాలకు, ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. మాకు కోర్టుపై గౌరవముంది. కానీ ఈ తీర్పు మాత్రం సరికాదు"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కూడా ఈ తీర్పుపై స్పందించారు. ED,CBIకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇలాంటి కేసుల్లో ఇరికిస్తారని మండి పడ్డారు. నిజాలు మాట్లాడినందుకే రాహుల్‌పై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"నవభారత్ అంటే ఇదే. అన్యాయానికి, ఈడీ, సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే కేసు నమోదు చేస్తారు. రాహుల్ నిజాలు మాట్లాడినందుకే ఆయనపై కేసు పెట్టారు. మోదీలాంటి నియంతకు వ్యతిరేకంగా నినదించినందుకే ఇలా చేశారు. ఈ తీర్పుని సవాలు చేస్తూ న్యాయపోరాటం చేసే హక్కు ఈ దేశం కల్పించింది. ఆ హక్కుని రాహుల్ ఉపయోగించుకుంటారు. మేం దేనికీ భయపడం."
- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత