Rahul Gandhi Defamation Case:


సూరత్‌ కోర్టు తీర్పు..


ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. 2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసిన క్రమంలో మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్. "దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది" అంటూ అప్పట్లో ఆయన చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. బీజేపీ తీవ్రంగా దీనిపై మండి పడింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు...రాహుల్‌కు శిక్ష విధించింది.  అయితే వెంటనే బెయిల్‌ కూడా మంజూరు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ఈ పిటిషన్ వేశారు. రాహుల్ ప్రధాని మోదీని దారుణంగా అవమానించారని ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా ఆ వర్గాన్ని కించపరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్‌పై ఐపీసీ సెక్షన్స్ 499,500 ప్రకారం పరువు నష్టం కేసు నమోదైంది. 2021 అక్టోబర్‌లో రాహుల్ సూరత్‌ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలం కూడా తీసుకున్నారు. పూర్తి విచారణ తరవాత ఆయనను దోషింగా తేల్చింది సూరత్ కోర్టు.