Saturn Transit 2023: జాతకాలను, గ్రహస్థితిని నమ్మని వారు గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా పెద్దగా పట్టించుకోరు.. కానీ.. జాతకాలను విశ్వసించేవారు మాత్రం గ్రహస్థితిని చూసుకుని ఏం జరుగుతుందో అనే టెన్షన్ పడతారు. ముఖ్యంగా ఏ గ్రహం అనుకూలంగా ఉన్నా లేకపోయినా శని సంచారానికి భయపడతారు. 


శని మూడురకాలు



  • ఏలినాటి శని

  • అర్టాష్టమ శని

  • అష్టమ శని 


ఏలినాటి శని


జన్మ రాశి నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏలినాటి శని అంటారు. ఒక్కో రాశిలో రెండున్నరేళ్లు చొప్పున మూడు రాశుల్లో జన్మరాశి నుంచి 12,1,2 స్థానాల్లో మొత్తం ఏడున్నరేళ్లు సంచరిస్తుంది. 



  • శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదొడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, మందులు వాడకం, తరచూ ప్రయాణాలు ఉంటాయి

  • జన్మరాశిలో అంటే శని ఒకటో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలాపనిందలు, భాగస్వాములతో వివాదాలు, మనశ్సాంతి ఉండకపోవడం, ధనవ్యయం, రుణబాధలు,వృత్తి-ఉద్యోగం-వ్యాపారంలో చికాకులు, స్థానచలన సూచన ఉంటుంది.

  • శని రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు పూర్తవుతున్నట్టే అనిపిస్తాయి కానీ ఏదీ పూర్తికాదు. అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తాడు. ఇంకా అప్పుల బాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన ఉంటుంది. 



  • జీవితంలో మొదటిసారి వచ్చే ఏలినాటి శనిని 'మంగుశని' అంటారు

  • రెండోసారి వచ్చే ఏలినాటి శనిని 'పొంగుశని' అని అంటారు

  • మూడోసారి వచ్చే ఏలినాటి శనిని 'మృత్యుశని' అంటారు


మొదటి రెండు సందర్భాల్లో వచ్చే శని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏదో ఒక సమయంలో సమస్యలకు బ్రేక్ వేస్తాడు. జీవితంపై నిరాశ కలిగించినట్టే కలిగించి అంతలోనే భవిష్యత్ పై ఆశ కల్పిస్తాడు. కానీ మూడోసారి వచ్చిన శనిని 'మృత్యుశని' అంటారు. ఈ దశలో అనారోగ్య సమస్యలు, అపమృత్యు భయం తప్పవు. ప్రాణం పోయేంతవరకూ పరిస్థితులు వెళతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతారు 


Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశి వారికి గతంలో కన్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి కానీ!


జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తున్న శనిని అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషమే.


అర్ధాష్టమ శని


జన్మరాశి నుంచి నాలగవ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.స్ధాన చలనం,స్ధిరాస్తి సమస్యలు,వాహన ప్రమాదాలు,తల్లిదండ్రులకు  ఉంటుంది.


అష్టమ శని


జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదొడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.శత్రు బాధలు,ఊహించని నష్టాలు వస్తాయి.


Also Read: ఈ రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అన్నింటా జయమే, ఆదాయం-గౌరవం-ఉద్యోగం అన్నింటా అనుకూలమే!


దశమ శని


జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి.


అయితే మీ జాతకచక్రంలో శని స్థానం బాగాలేకపోయినా గురుబలం బావుంటే ఆ ప్రభావం అంతగా ఉండదు. ఇక శనిదోషం నుంచి విముక్తి పొందాలంటే శనివారం శనికి తైలాభిషేకం, జపాదులు చేయించుకోవచ్చు.  మరో ముఖ్యవిషయం ఏంటంటే శని శ్రమకారకుడు. బద్ధకాన్ని అస్సలు సహించడు. శ్రమకారక జీవులైన చీమలకు పంచదారం వేయడం, పశు-పక్ష్యాదులకు ఆహారం-నీళ్లు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఎక్కువగా నడవడం - ఒళ్లొంచి కష్టపడడం చేస్తే శనిదోషం తగ్గుతుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు