ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్​ మహేశ్వరి.. ఆ సంస్థ గ్లోబల్​ మార్కెట్​లో కీలక బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఆయన ట్విట్టర్ హెడ్​క్వార్టర్స్​ ఉన్న శాన్​ఫ్రాన్సిస్కోకు వెళ్లనున్నారు. ఇకపై మనీశ్ మహేశ్వరి  గ్లోబల్​ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్​ విభాగ డైరెక్టర్​గా పని చేయనున్నారు. అయితే మనీశ్​ మహేశ్వరి నుంచి భారత కార్యకలాపాల బాధ్యతలను ఎవరికి బదిలీ చేయనున్నారు? అనే విషయంపై ట్విట్టర్​ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


 కేంద్రం వర్సెస్ ట్విట్టర్ వార్ ఎపిసోడ్ కూడా కొద్ది రోజులు బాగానే నడిచింది. భారత కొత్త ఐటీ రూల్స్‌ను వ్యతిరేకిస్తూ వచ్చింది ట్విట్టర్. నేతల ట్విట్టర్ ఎకౌంట్ వెరిఫై బ్యాడ్జిలను తొలగిస్తూ.. వచ్చింది.  ఆ తర్వాత మళ్లీ యాడ్ చేసింది. కొత్త ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కొంత కాలం గళం విప్పింది ట్విటర్‌. గ్రీవెన్స్‌ అధికారిగా భారతీయుడినే.. నియమించాలనే నిబంధన అమలు చేసేందుకు కాస్త ఆలోచించింది. భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. చివరకు భారతీయుడినే గ్రీవెన్స్‌ అధికారిగా నియమించింది.



ఇటీవల కేంద్రం నుంచి ట్విట్టర్ ఫిర్యాదులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఖాతాలను సైతం బ్లాక్ చేయడంతో ఆ సంస్థపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మనీశ్ మహేశ్వరి బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్‌ నియమించనున్నట్లు తెలుస్తోంది.


 


గతంలో కోర్టులో మనీష్ కు ఊరట


యూపీలో అబ్దుల్ సమద్ అనే ముస్లిం వృద్ధుడిపై సుమారు ఒకటిన్నర నెల క్రితం జరిగిన దాడి కేసుకు సంబంధించి మనీష్ పైన పోలీసులు కేసు పెట్టారు. ఆ వృద్ధుడిపై దాడి చేసిన వీడియో అప్ప్పట్లో వైరల్ అయింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని ట్వీట్లను తొలగించాలని పోలీసులు మనీష్ ను కోరినా ఆయన నిరాకరించారు. తమ విచారణకు హాజరు కావాలంటూ ఘజియాబాద్ పోలీసులు గత జూన్ 23 న మనీష్ మహేశ్వరికి సమన్లు పంపారు. అంతకు ముందే ఒకసారి వారు జారీ చేసిన సమన్లను ఆయన అప్పుడే కోర్టులో సవాల్ చేశారు. అప్పుడు ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. దాంతో ఘజియాబాద్ పోలీసులు పట్టు విడవకుండా మళ్ళీ నోటీసులను పంపారు.  సమన్లను సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో మనీష్ పిటిషన్ దాఖలు చేశారు. కర్ణాటక హైకోర్టు నుంచి కూడా ఆయనకు ఊరట లభించింది.  మనీష్ తన ట్వీట్స్ ద్వారా రెండు మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, క్రిమినల్ కుట్రకు పాల్పడ్డారని పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు దురుద్దేశపూరితంగా ఉన్నాయని, వేధింపులకు నిదర్శనంగా కనిపిస్తున్నాయని, కేసును కావాలనే తప్పుదారి పట్టించేట్టు వారు యత్నిస్తున్నారని కోర్టు పేర్కొంది.