Supreme Court Questions Madhya Pradesh High Court: మధ్యప్రదేశ్ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మహిళా న్యాయాధికారులను విధుల నుంచి తొలగింపునకు సంబంధించిన సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. గర్భస్రావం కారణంగా ఓ మహిళా న్యాయమూర్తి అనుభవించిన మానసిక, శారీరక వ్యధను మధ్యప్రదేశ్ హైకోర్టు (MadhyaPradesh High Court) విస్మరించిందని పేర్కొంది. పురుషులకు నెలసరి వస్తే వారి పరిస్థితి తెలిసేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సివిల్ జడ్జీల తొలగింపు విధి విధానాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది.
సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
ఆశించిన స్థాయిలో పనితీరు లేదనే కారణంతో ఆరుగురు సివిల్ జడ్జీలను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో నలుగురిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఫుల్ బెంచ్ నిర్ణయించగా.. మరో ఇద్దరికి మాత్రం ఎలాంటి ఉపశమనం కలగలేదు. అందులో ఓ న్యాయమూర్తి తనకు గర్భస్రావం కావడంతో పాటు తన సోదరుడు క్యాన్సర్ బారిన పడినట్లు ఉన్నత న్యాయస్థానం ముందు వివరణ ఇచ్చారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఎంపీ హైకోర్టు తీరును తప్పుబడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది.
'ఆ న్యాయమూర్తికి గర్భవిచ్ఛిత్తి జరిగింది. అటువంటి మహిళ మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది. పురుషులకూ నెలసరి వస్తే సమస్య ఏంటనేది తెలిసేది.' అని జస్టిస్ బీవీ నాగరత్న పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితులేవీ పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పని తీరు ఆధారంగా ఆమెను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అటువంటి ప్రమాణాలు పురుష న్యాయమూర్తులకూ ఉండాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు.