Maharashtra New Government | ముంబయి: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పాటుపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కానీ కొత్తగా ఏర్పాటు కానున్న మహాయుతి కూటమి ప్రభుత్వంలో మంటలు ఇంకా చల్లారలేదు. మహారాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్‌ను బుధవారం నాడు దేవేంద్ర ఫడ్నవీస్, మహాయుతి నేతలు వెళ్లి కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను ఫడ్నవీస్ కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటకు సంబంధించి లేఖ సమర్పించారు. మహారాష్ట్రలోని ఆజాద్ మైదాన్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.


దుమారం రేపుతున్న ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్యలు
అనంతరం దేవేంద్ర ఫడణవీస్‌, ఎన్సీపీ అధినేత అజిత్‌ పవార్‌ (Ajit Pawar), ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్‌ షిండే పాల్గొన్న మీడియా సమావేశంలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. మొదట సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ అని కూటమి పెద్దలు నిర్ణయించారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను బుధ‌వారం ఎన్నుకున్నారు.  డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేస్తారని బీజేపీ నేతలు చెప్పారు. కానీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారా అని మీడియా అడిగిన సమయంలో ఏక్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు మహాయుతిలో దుమారం రేపుతున్నాయి.


అజిత్ పవార్‌ల ఉదయం పూట, సాయంత్రం పూట ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం తనకు లేదని ఎద్దేవా చేశారు. అజిత్ పవార్ పూటకో మాట మాట్లాడతారని, తాను మాత్రం అలా కాదంటూ ఎన్సీపీ నేతకు శివసేన నేత ఏక్‌నాథ్ షిండే చురకలు అంటించారు. సాయంత్రం తన నిర్ణయం చెబుతా అంటూ షిండే బాంబు పేల్చారు. సాయంత్రానికి విషయంపై కొలిక్కి వస్తుందని, అప్పుడు అజిత్ పవార్ కు అసలు విషయం తెలుస్తుందన్నారు. తానైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నానని అజిత్ పవార్ క్లారిటీ ఇచ్చారు. 


మహారాష్ట్రంలో గురువారం కొత్త ప్రభుత్వం
గురువారం (డిసెంబర్ 5న) మహారాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో గురువారం సాయంత్రం 5.30 గంటలకు మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీనిపై కాబోయే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. తాను ఏక్‌నాథ్‌ షిండేను కలిసి, ప్రభుత్వంలో ఆయన చేరాలని మహాయుతి ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారని తెలిపాను. దీనికి ఆయన సానుకూలంగా స్పందిస్తారని నమ్మకం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌ను కలిసి అనుమతి తీసుకున్నాం. అంతా సవ్యంగా జరుగుతుంది. సీఎం, డిప్యూటీ సీఎం అనేవి కేవలం టెక్నికల్ పోస్టులు మాత్రమే. మహాయుతి ప్రభుత్వంలో మేం కలిసి పనిచేస్తాం అని’ పేర్కొన్నారు. 



కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ‌న్, మరికొందరు నేతలు మ‌హాయుతి నాయ‌కులతో చర్చలు జరిపి పంచాయ‌తీని ఒక కొలిక్కి తెచ్చారు. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే అని ఫిక్స్ చేశారు. కానీ ఏక్‌నాథ్ ఇంకా అలక వీడలేదు. తన అభిప్రాయాన్ని చెప్పకుండా ఇంకా నాన్చుతూనే వస్తున్నారు.


మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 132 సీట్లు రాగా, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనకు 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు మొత్తం 235 స్థానాల్లో మహాయుతి అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కేవలం 50 సీట్లకే పరిమితమైంది. 


Also Read: Maharashtra New CM : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవీస్‌, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్