Woman Hits Her Huband For Not Eating Soaked Chana In Pune: చిన్న చిన్న విషయాలకే కొందరు దంపతుల మధ్య తగాదాలు వస్తున్నాయి. మహారాష్ట్ర పుణేలో (Pune) అలాంటి ఘటనే చోటు చేసుకుంది. నానబెట్టిన శనగలు తినలేదని ఓ మహిళ తన భర్తపై దాడికి పాల్పడింది. వేలు కొరికి మిక్సీ జార్‌తో తలపై కొట్టింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర (Maharastra) పుణెలోని సోమవార్‌పేట్ త్రిశుండ గణపతి ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో భర్త (44), భార్య (40) నివాసం ఉంటున్నారు. ఈ నెల 1న (ఆదివారం) రాత్రి నానబెట్టిన శనగల విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఆ శనగలు తినాలని భార్య చెప్పగా.. తనకు ఇష్టం లేదని చెప్పి భర్త అందుకు నిరాకరించాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య.. భర్తను దుర్భాషలాడుతూ అతనితో గొడవపడింది.
మిక్సీ జార్‌తో తలపై బాదింది
భర్త ఎదురు తిరగడంతో సుత్తితో దాడి చేసేందుకు యత్నించింది. అతను ఆ సుత్తిని లాక్కోవడంతో మిక్సీ జార్‌తో తలపై బాదింది. ఆమె దాడి నుంచి తప్పించుకునేందుకు తలకు చేతులు అడ్డం పెట్టుకోవడంతో భర్త వేలు కొరికేసింది. ఆపై కర్రతో విచక్షణారహితంగా చితక్కొట్టింది. ఎలాగోలా ఆమె నుంచి తప్పించుకున్న భర్త స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేస్తామని.. ఇంటికి వెళ్లాలని పోలీసులు బాధితునికి చెప్పగా భయంతో వణికిపోతూ అందుకు నిరాకరించాడు. రాత్రికి తనకు పోలీస్ స్టేషన్‌లోనే ఆశ్రయం కల్పించాలని కోరాడు. తన భార్య మిక్సీ జార్‌తో రెండుసార్లు తలపై కొట్టిందని.. చిటికెన్ వేలు కొరికేసిందని, కర్రతో చితకబాదిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భర్త పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Kerala Viral News: బస్టాండ్‌లో కూర్చొని ఫోన్ చూస్తుండగా కౌగిలించుకున్న బస్- తృటిలో తప్పిన ఘోరం