నేరం చేసే వాళ్లకు చట్టమంటే  భయం ... పోలీసులంటే లెక్కలేని తనం... న్యాయస్థానం అంటే గౌరవం లేకపోవడం సహజం. వారికి అవి నేర్పిస్తేనే నేరాలు చేయకుండా ఉంటారు. కానీ కొంత మంది తాము అన్నింటికీ ఆతీతులమని అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నేతల ప్రమేయం ఉన్న ఘటనల్లో నిందితులు విపరీత ప్రవర్తనకు పోతూంటారు. ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణ జరిగింది. 


ఢిల్లీలోని జహంగీర్ పూర్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ఘర్షణ చోటు చేసుకుంది. కొంత మంది దుండగులు హనుమాన్ శోభాయాత్రపై రాళ్ల దాడులకు పాల్పడ్డారు. చివరికి అది భారీ ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలకు కారణమైన వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.  వారిని రోహిణి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టులో హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో అల్లర్లకు పాల్పడిన  అన్సార్ తగ్గేదేలేదు అంటూ నవ్వుతూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం చేసి చూపించారు. 



అన్సార్ క్రిమినల్. ప్రజలను రెచ్చగొట్టి, రాళ్లు రువ్వేలా చేశారు. వారి నుంచి మూడు తుపాకులు, ఐదు కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇతని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉండి ఉంటుందని.. వారే బయటకు తీసుకు వస్తారనే ధీమాతో ఇలా  వెకిలి వేషాలు వేస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మత రాజకీయాలు చేస్తూ... ఇతర మతాలపై దాడులకు పాల్పడితే విషయం రాజకీయం అవుతుందని తెలిసి కూడా కొంత మంది కావాలనే చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.