Jammu and Kashmir Terror Attack : జమ్మూకశ్మీర్ ఉగ్రదాడి (Terror Attack )లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడికి ముందు జవాన్లపై ఎలా దాడి చేయాలన్న దానిపై రెక్కి నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఎక్కడి నుంచి దాడి చేయాలో ముందుగానే ప్రణాళిక రూపొందించుకొని అమలు చేసినట్లు చెబుతున్నారు. పూంఛ్‌ (Poonch) జిల్లాలో జవాన్లు వెళ్తున్న సైనిక వాహనాలపై ఉగ్రవాదులు (Terrorists) దాడికి తెగబడ్డారు. దాడికి ముందు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించి, కొండల పైనుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని, లష్కరే తొయిబా అనుబంధ సంస్థ పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ ప్రకటించింది. 


మలుపు వద్ద కాపు కాసి, కొండలపై నుంచి కాల్పులు
పూంఛ్‌ జిల్లాలోని ధేరా కి గాలి- బుఫ్లియాజ్‌ మధ్య ధత్యార్‌ మోర్‌ వద్ద ప్రమాదకరమైన మలుపు ఉంది. అక్కడ జవాన్ల వాహనం స్లోగా కదలడంతో...అదను చూసి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురుకాల్పులకు దిగడంతో టెర్రరిస్టులు పారిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కాల్పులు జరిపిన ప్రాంతంలో ఇండియన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. పూంఛ్ ప్రాంతంలో సైనికులు గాలింపు చేపట్టారు.  ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోనే ఉంటారన్న అనుమానంతో...నలుదిక్కులా ఆపరేషన్ చేస్తున్నారు. టెర్రరిస్టులను కనిపెట్టడానికి ఒకవైపు డ్రోన్లు, మరోవైపు స్నిఫర్ డాగ్స్ ను రంగంలోకి దించారు.  అవసరమైతే అదనపు బలగాలను రప్పించైనా సరే...ముష్కరులను పట్టుకుంటామని ఆర్మీ అధికారులు తెలిపారు. ధేరా కి గాలి- బుఫ్లియాజ్‌ ప్రాంతాలను ఆర్మీ జల్లెడ పడుతోంది.


అమెరికాలో తయారైన ఎం-4 కార్బైన్ రైఫిల్స్
అమెరికాలో తయారైన ఎం-4 కార్బైన్ రైఫిల్స్ వాడినట్లు పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ సోషల్ మీడియాలో ఫోటోలను విడుదల చేసింది.  ఎం-4 కార్బైన్ రైఫిల్స్ ను అమెరికా 1980లో తయారు చేసింది. బరువు ఎక్కువగా ఉండకపోవడంతో వీటిని ఎక్కువగా అమెరికా సైనికులు వినియోగిస్తారు. ఎం-4 కార్బైన్ రైఫిల్స్ ను ఉగ్రవాదులు వాడటం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు ఉగ్రవాదులు...పలు దాడుల్లో వీటిని ఉపయోగించారు. 2016 నుంచి ఈ రైఫిల్స్ వాడటం ఎక్కువైంది. ఎం-4 కార్బైన్ రైఫిల్స్ భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 


ఐదుగురు వీరమరణం
జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై గురువారం టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం ఇండియన్ ఆర్మీ వేట కొనసాగిస్తోంది. మూడు రోజులుగా జవాన్లు...అడవులను జల్లెడ పడుతున్నారు. రాజౌరి నుంచి సురన్ కోటే వైపు జవాన్లు వాహనాల్లో వెళ్తుండగా, భద్రతాబలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ముగ్గురు లేదా నలుగురు ముష్కరులు జవాన్లపై కాల్పులకు తెగబడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నవంబరు నెలలో ఇలాగే టెర్రరిస్టులు భద్రతా బలగాలపై దాడికి పాల్పడ్డారు. రాజౌరీ జిల్లాలో చిన్నపాటి గుహల్లో నక్కి భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.