Parliament Security Breach:
రాహుల్ సెటైర్లు..
లోక్‌సభలో దాడి (Lok Sabha Security Breach) జరిగిన సమయంలో బీజేపీ ఎంపీలు వెంటనే సభ నుంచి పారిపోయారని సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన నిరసనలో పాల్గొన్న రాహుల్...లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు దూసుకురాగానే బీజేపీ ఎంపీలు భయపడిపోయారని విమర్శించారు. ఆ దాడి అసలు ఎందుకు జరిగిందో గమనించాల్సిన అవసరముందని అన్నారు. వాళ్లు దాడి చేసేలా ఏ పరిస్థితులు అలా ప్రేరేపించాయో తెలుసుకోవాలని సూచించారు. దేశంలో నిరుద్యోగం దారుణంగా పెరుగుతోందని, ఈ సమస్యే వాళ్లు దాడి చేసేలా చేసిందని తేల్చి చెప్పారు. లోక్‌సభలో జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ సభలోనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష ఎంపీలు. ఈ కారణంగా సభలో గందరగోళం నెలకొంది. ఇదే కారణాన్ని చూపిస్తూ శీతాకాల సమావేశాల్లో మొత్తం రెండు సభలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్‌ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పార్లమెంట్ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు ప్రతిపక్ష ఎంపీలు. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది. ఇవాళ (డిసెంబర్ 22) జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలోనే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"లోక్‌సభలోకి ఇద్దరు యువకులు దూసుకొచ్చారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీలు భయపడిపోయారు. వెంటనే సభ నుంచి పారిపోయారు. దాడి జరగడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. కానీ ఆ యువకులను దాడికి ప్రేరేపించిన పరిస్థితులను గమనించాలి. ఈ తరహాలో వాళ్లు ఎందుకు నిరసన వ్యక్తం చేశారో ఆలోచించాలి. దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది. అందుకే ఇలా దాడి చేశారు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
మీడియా అనవసరమైన విషయాలపై శ్రద్ధ పెడుతోంది తప్ప కీలకమైన సమస్యల గురించి మాత్రం చర్చించడం లేదని మండి పడ్డారు రాహుల్ గాంధీ. తాను ఓ వీడియో తీసిన విషయాన్నే పదేపదే హైలైట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.