Parliament Security Breach : పార్లమెంట్ (Parliament)లో ఎంపీలపై బహిష్కరణ వేటును ఇండియా కూటమి (I.N.D.I.A Alliance)నిరసించింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఢిల్లీ (Delhi )లోని జంతర్ మంతర్ (Jantar Mantar ) వద్ద విపక్షాలు ఆందోళనకు దిగాయి. లోక్ సభలో యువత పొగ వెదజల్లిన వెంటనే బీజేపీ ఎంపీలు బయటకు పారిపోయారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. పార్లమెంట్ లోకి యువత ఎందుకు ప్రవేశించారనేది తెలుసుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు.  ఈ ఘటనలో భద్రతా వైఫల్యం ప్రధాన అంశమని తెలిపారు.  దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతోనే యువత పార్లమెంట్ లోకి వచ్చి నిరసనకు దిగారని అన్నారు. ఉపాధి గురించి మాట్లాడని మీడియా, ఎంపీల రక్షణ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ బయట కూర్చుంటే ..తాను వీడియోలు రికార్డు చేయటాన్ని మాత్రం ప్రసారాలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


తమకు పార్లమెంట్ లో నోటీసులు ఇచ్చినపుడు, కనీసం నోటీసుల్లో ఏముందో చదవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలను సభ నుంచి బహిష్కరించి, బిల్లులను ఏకపక్షంగా ఆమోదింపజేసుకుంటోందని మండిపడ్డారు.  


ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గు-భట్టి విక్రమార్క
పార్లమెంటుపై జరిగిన దాడికి ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పకుండా  ఎంపీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రశ్నిస్తే కేసులు, పార్లమెంట్ నుంచి బహిష్కరణ వేటు వేయడం, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని విమర్శించారు.  నియంత్రత్వ పోకడలతో మోడీ పాలన సాగుతుందనడానికి ఎంపీల సస్పెన్షనే నిదర్శనమన్నారు భట్టి విక్రమార్క. పార్లమెంట్ పై జరిగిన దాడితో ప్రపంచ దేశాల్లో దేశ విలువ ఎంత దిగజారిందో దేశ ప్రజలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 140 మందికిపైగా సస్పెండ్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఎన్నికల ముందు దేశ సరిహద్దుల్లో చిన్న చిన్న సంఘటనలు సృష్టించి,  దేశ ప్రజలలో భావోద్వేగాలు రగిలించి, అధికారంలోకి రావడం తప్పా దేశానికి బీజేపీ ఏమీ చేయలేదన్నారు. 


న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉందన్న ప్రహ్లద్ జోషి


సభా కార్యకలాపాలు సక్రమంగా జరగనివ్వకుండా విపక్ష ఎంపీలు అడ్డుకున్నాయన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి. ఎంపీలను సస్పెండ్‌ చేయడం తమ ప్రభుత్వానికి ఇష్టం లేదన్న ఆయన, కొందరిపై వేటు వేసిన తర్వాత మరికొందరు విపక్ష సభ్యులు సస్పెండ్ చేయాలని అభ్యర్థించారని వెల్లడించారు. పార్లమెంటులో ఆమోదం పొందిన మూడు బిల్లులపై విపక్షాలకు ఏవైనా అభ్యంతరాలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉందన్నారు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై దర్యాప్తు కొనసాగుతోందన్న ప్రహ్లాద్ జోషి, నివేదిక వచ్చిన తర్వాత చట్టం తన పని చేసుకుపోతుందని వెల్లడించారు. తమ పార్టీ ఎంపీ ప్రతాప్‌ సింహ స్టేట్ మెంటును రికార్డు చేశామని స్పష్టం చేశారు.