One Nation One Election:
జమిలి ఎన్నికలపై అసహనం..
One Nation One Electionపై కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ ఓ నివేదిక ఇవ్వనుంది. అయితే...ఉన్నట్టుండి ఈ కమిటీ ఏర్పాటు చేయడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేవలం స్వలాభం కోసమే బీజేపీ ఈ కొత్త ఎత్తుగడ వేస్తోందని విమర్శిస్తున్నాయి. దీనిపై బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. బీజేపీ మొత్తం దేశాన్నే నియంత్రించాలని చూస్తోందని మండి పడ్డారు. ఇప్పుడు ఒకే దేశం, ఒకే ఎన్నిక అంటున్న బీజేపీ...రేపు ఒకే దేశం, ఒకే పార్టీ అంటుందని సెటైర్లు వేశారు. అంతకన్నా ముందు వన్ నేషన్, వన్ ఇన్‌కమ్ పాలసీ ప్రకటించి ఉంటే బాగుండేదని అన్నారు.
"బీజేపీ దేశాన్ని తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని చూస్తోంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అందుకోసమే. అయినా వీటి కన్నా ముందు వన్ నేషన్, వన్ ఇన్‌కమ్ పాలసీ ప్రకటించి ఉంటే బాగుండేది. దీని తరవాత వన్ నేషన్, వన్ పార్టీ అంటారు. ఆ తరవాత ఒకే దేశం, ఒకే నేత, ఒకే దేశం,ఒకే మతం అని రకరకాల నినాదాలు ఇస్తారు. ఇవన్నీ ఎందుకూ పనికిరాని నిర్ణయాలు"
- తేజస్వీ యాదవ్, బిహార్ డిప్యుటీ సీఎం
ముందస్తు ఎన్నికలు..?
ఇక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. బహుశా లోక్‌సభ ఎన్నికలు ముందస్తుగానే జరిగే అవకాశముందని, అందుకోసమే ఈ సమావేశాలు ఏర్పాటు చేసి ఉండొచ్చని అన్నారు.
"లోక్‌సభ ఎన్నికలు అనుకున్న దాని కన్నా ముందుగానే జరిగే అవకాశముంది. బహుశా ఇది ప్రకటించేందుకే కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిందేమో. ఒకవేళ లోక్‌సభ ఎన్నికలు ముందస్తుగానే జరిగితే మేం మా కూటమి మరింత వేగంగా పని చేస్తుంది. బీజేపీని ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉంటుంది"
- నితీష్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నట్టుండి సంచలన ప్రకటన చేశారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. చర్చలు సఫలవంతంగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ఒకే దేశం, ఒకే ఎన్నికపై బిల్ ప్రవేశపెట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ప్రహ్లాద్ జోషి.. కేవలం కమిటీ మాత్రమే వేశామని, ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
"ప్రస్తుతానికి కమిటీ మాత్రమే ఏర్పాటు చేశాం. ఈ కమిటీ అన్ని అభిప్రాయాలు సేకరించి నివేదిక సమర్పించిన తరవాతే దీనిపై పూర్తిస్థాయిలో చర్చిస్తాం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో మరో రెండు మూడు రోజుల్లో ఖరారవుతుంది. ఇక్కడ మరో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 1967వరకూ లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ విప్లవాత్మక నిర్ణయం అనే భావిస్తున్నాను."
- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
Also Read: Tribal Woman: రాజస్థాన్‌లో ప్రభుత్వం ఉందా? గిరిజన మహిళ ఘటనపై జేపీ నడ్డా ఫైర్