NDA leaders met President Murmu in Delhi: న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నేతలు శుక్రవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఎన్టీయే ప్రభుత్వానికి తమ మద్దతు ఉందని లేఖలు సమర్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత నితీష్ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి, ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్, ఏక్‌నాథ్ షిండే, తదితర ఎన్డీయే పక్ష నేతలు రాష్ట్రపతి ముర్మును కలిసిన వారిలో ఉన్నారు.


అంతకుముందు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే నేతలు సమావేశం అయ్యారు. ఎన్డీయే మిత్రపక్షాల నేతలతో బీజేపీ పెద్దలు భేటీ అయి.. కేంద్ర మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న కీలక మంత్రుల జాబితాపై కసరత్తు చేశారు. అయితే మిత్రపక్షాల మంత్రులతో కలిసి మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 






రాష్ట్రపతిని కలిసిన నరేంద్ర మోదీ 
ఎన్డీయే లోక్‌సభ పక్షనేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలిపిన ఎంపీల జాబితాను రాష్ట్రపతి ముర్ముకు సమర్పించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని మోదీ కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని పనిచేస్తామన్నారు. ఈ 18వ లోక్‌సభలో యువత ఎక్కువగా ఉన్నారని, రాజకీయాల్లోకి వచ్చిన వారికి అభినందనలు తెలిపారు. జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తామని రాష్ట్రపతికి తెలియజేసినట్లు చెప్పారు.