NDA Leader Modi Meet President Droupadi Murmu: ఎన్డీయే పార్లమెంటరీ లీడర్ నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (Droupadi Murmu) కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా తనను లోక్ సభ పక్షనేతగా ఎన్డీయే మిత్రపక్షాలు ఎన్నుకున్న తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. మోదీ వెంట ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు ఉన్నారు. తమ కూటమికి మద్దతు ఇస్తోన్న పార్టీల లేఖలు, కొత్తగా ఎంపికైన మొత్తం ఎంపీల జాబితాను రాష్ట్రపతికి మోదీ అందించారు. ఈ క్రమంలో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోదీని రాష్ట్రపతి ఆహ్వానించారు. మోదీకి రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఓ జ్ఞాపికను బహూకరించారు.
మోదీ ఏమన్నారంటే.?
దేశానికి మరింత సేవ చేయాలని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారని.. దేశ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిచ్చే ఎంపీల జాబితాను రాష్ట్రపతికి అందించామని.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరినట్లు చెప్పారు. ఈ నెల 9న (ఆదివారం) ప్రమాణ స్వీకార్ చేయనున్నట్లు రాష్ట్రపతికి తెలియజేశామని వెల్లడించారు.
ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీయే కూటమి నేతలు శుక్రవారం ఉదయం కీలక సమావేశం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ ఎన్డీయే పక్షనేతగా మోదీని ప్రతిపాదించగా ఎంపీలంతా ఆమోదించారు. ఈ క్రమంలో ఆయన మూడోసారి ప్రధానిగా ఈ నెల 9న కర్తవ్యపథ్‌లో ప్రమాణం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మోదీ బాధ్యతలు చేపట్టేలా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ రోజు ప్రధానితో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.