Tareekh Pe Tareekh:
వాయిదా మీద వాయిదా..
కేసులు పదేపదే వాయిదా పడడంపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) డీవై చంద్రచూడ్ (CJI D Y Chandrachud ) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుని "వాయిదా మీద వాయిదా" కోర్టుగా మార్చేస్తున్నారంటూ మండి పడ్డారు. సన్నీ డియోల్ ఫేమస్ డైలాగ్ అయిన 'tareekh pe tareekh'ని ప్రస్తావిస్తూ లాయర్లపై మండి పడ్డారు. సెప్టెంబర్, అక్టోబర్..ఈ రెండు నెలల్లోనే 3,688 కేసులు వాయిదా పడ్డాయని గుర్తు చేశారు. వాటిని ముందస్తు విచారణ జాబితాలో పెట్టినప్పటికీ అవన్నీ వాయిదా పడ్డాయంటూ అసహనానికి లోనయ్యారు.
"బార్ సభ్యులందరికీ నాదొక్కటే విజ్ఞప్తి. అవసరం అయితే తప్ప కేసులను వాయిదా వేయకండి. దయచేసి సుప్రీంకోర్టుని "వాయిదా మీద వాయిదా" కోర్టుగా మార్చకండి. ఇలా వాయిదాలు వేయడం వల్ల ప్రజలకు కోర్టుపై ఉన్న నమ్మకం పోతుంది"
- డీవై చంద్రచూడ్, సీజేఐ
లక్షలాది కేసులు పెండింగ్..
ఒక్కరోజే 178 కేసులు వాయిదా పడడం వల్ల ఈ వ్యాఖ్యలు చేశారు CJI చంద్రచూడ్. tareekh pe tareekh అప్పట్లో బాలీవుడ్‌ని ఒక ఊపు ఊపింది. సన్నీ డియోల్‌కి ఐకానిక్ డైలాగ్‌గా మిగిలిపోయింది. బాలీవుడ్ మూవీ Damini లోని డైలాగ్ ఇది. ఆ సినిమాలో కోర్టులో కేసులు వాయిదా పడడాన్ని ప్రస్తావిస్తూ సెటైర్లు వేస్తూ ఈ డైలాగ్ చెబుతాడు సన్నీ డియోల్. ఇప్పుడదే డైలాగ్‌ని కోట్ చేస్తూ CJI చంద్రచూడ్ ఫైర్ అయ్యారు. సగటున రోజుకి కనీసం 154 కేసులు వాయిదా పడుతున్నాయని చెప్పారు. అందులో కొన్ని అత్యవసర విచారణ జాబితాలో ఉన్నాయి. ఒక్కోసారి ఓ కేసు కనీసం మూడు సార్లు వాయిదా పడుతోందని అన్నారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. సుప్రీంకోర్టులో 69 వేలకు పైగా, హైకోర్టుల్లో 59 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఇటీవలే కేంద్రన్యాయశాఖ పార్లమెంట్‌కి వెల్లడించింది.