Karnataka CM Chair:
సీఎం పదవిపై ప్రియాంక్ ఖర్గే..
కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే ( Priyank Kharge) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్ ఆదేశిస్తే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధంగానే ఉన్నట్టు వెల్లడించారు. సీఎం పదవిపై ఆసక్తి ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారు.
"నేను ముఖ్యమంత్రిని అవ్వాలా వద్దా అన్నది అధిష్ఠానం నిర్ణయించాలి. ఒకవేళ హైకమాండ్ నన్ను ఆదేశిస్తే తప్పకుండా ఆ కుర్చీలో కూర్చుంటాను. అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను"
- ప్రియాంక్ ఖర్గే, కర్ణాటక మంత్రి
బీజేపీపై ఆరోపణలు..
ఈ క్రమంలోనే బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు ప్రియాంక్ ఖర్గే. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కర్ణాటకలోని బీజేపీ నేతలకు రూ.1000కోట్లు ఇచ్చారని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఇంత డబ్బు ముట్టజెప్పారని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గనిగ బీజేపీపై ఆరోపణలు చేశారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వద్దకు బీజేపీ టీమ్ వచ్చిందని, రూ.50 కోట్ల డబ్బు ఆశ చూపించి బీజేపీలోకి రావాలని అడిగిందని చెప్పారు. అంతే కాదు. బీజేపీలో చేరితే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టూ ఆరోపించారు. ప్రియాంక్ ఖర్గే కూడా ఇదే తరహాలో బీజేపీపై మండి పడ్డారు. అయితే..ఉన్నట్టుండి ముఖ్యమంత్రి పదవి గురించి చర్చ జరగడమే ఆసక్తికరంగా మారింది. ఇటీవలే సీఎం సిద్దరామయ్య (CM Siddaramaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పాటు సీఎం పదవిలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. రెండున్నరేళ్ల తరవాత కర్ణాటక ముఖ్యమంత్రి మారిపోతారన్న ఊహాగానాలు వస్తున్న క్రమంలో ఈ క్లారిటీ ఇచ్చారు సిద్దరామయ్య.
"ఐదేళ్ల పాటు కర్ణాటకలో మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. అధికారంలో ఉన్నన్ని రోజులు నేనే ముఖ్యమంత్రిని. ఐదేళ్ల పాటు నేనే ఆ పదవిలో కొనసాగుతాను"
- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి
ఈ ఏడాది మే నెలలో కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లతో భారీ మెజార్టీతో విజయం సాధించింది. బీజేపీ 66 స్థానాలకు పరిమితమైంది. మే 20వ తేదీన ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి పదవి రేసులో సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఉన్నప్పటికీ...హైకమాండ్ సిద్దరామయ్యకే అవకాశమిచ్చింది. సీనియార్టీని గౌరవించింది. అప్పటి నుంచి డీకే శివకుమార్ అసహనంతో ఉన్నారన్న పుకార్లు కూడా వచ్చాయి. అయితే...ఈ విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదని క్లారిటీ ఇచ్చారు డీకే శివకుమార్.
Also Read: బయటకు వచ్చారో బాడీలో ప్రతి అవయవం పాడైపోతుంది - ఢిల్లీ కాలుష్యంపై వైద్యుల వార్నింగ్