Delhi Pollution: 


ఢిల్లీ కాలుష్యం..


ఢిల్లీలో కాలుష్యం  (Delhi Air Pollution) ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. బయటకు రావాలంటేనే భయపడేంతలా దుమ్ము కమ్ముకుంది. స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు (Delhi Air Quality) వీల్లేకుండా పోయింది. పౌరులంతా మాస్క్‌లు పెట్టుకుని తిరుగుతున్నారు. కాలుష్య స్థాయిని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఆ ప్రభావం తక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రానురాను వాయు నాణ్యత ఇంకా పడిపోయే ప్రమాదముందని వివరిస్తున్నారు. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యంపై ఈ కాలుష్యం తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. 


"ప్రస్తుతం ఢిల్లీ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. చెప్పాలంటే రాజధాని నగరం గ్యాస్‌ ఛాంబర్‌గా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్తే కళ్లు మండుతాయి. గొంతు నొప్పి మొదలవుతుంది. ఇప్పటికే హాస్పిటల్స్‌లో ఓపీ డిపార్ట్‌మెంట్‌లో పేషెంట్స్ సంఖ్య 20-30% మేర పెరిగింది. ఈ విషవాయువు శరీరంలోకి వెళ్తే ప్రతి అవయవంపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. కానీ పని చేయాలంటే బయటకు వెళ్లక తప్పదు. అందుకే...బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్‌లు పెట్టుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి"


- డా. సందీప్ నాయర్, వైద్య నిపుణులు


 






ఢిల్లీలో ఈ పరిస్థితి రావడానికి ఆప్ సర్కార్ వైఫల్యమే కారణమని బీజేపీ నేతలు మండి పడుతున్నారు. షెహజాద్ పూనావాలా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మాస్క్‌ లేకుండా బయటకు వచ్చే పరిస్థితే లేకుండా చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా కేజ్రీవాల్ ప్రభుత్వం కాలుష్యం తగ్గించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. ప్రతిసారీ పంజాబ్‌పై తప్పు నెట్టేస్తున్నారని, ఇప్పుడక్కడ ఆప్ ప్రభుత్వమే ఉన్నా సమస్యని పరిష్కరించలేదని విమర్శించారు.అయితే ఈ విమర్శలపై ఆప్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో డీజిల్ జనరేటర్‌లు బ్యాన్ చేశామని గుర్తు చేస్తున్నారు. CNG,ఎలక్ట్రిక్ బస్‌ల సంఖ్య పెంచామని వివరిస్తున్నారు. యూపీ, హరియాణాలో ఎలక్ట్రిక్ బస్‌లు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు.