Delhi Air Pollution:
తీవ్ర స్థాయికి కాలుష్యం..
ఢిల్లీలో కాలుష్యం మరీ తీవ్ర స్థాయికి (Air pollution in Delhi) చేరుకుంది. ఎక్కడ చూసిన పొగ కమ్ముకుంది. వాయు నాణ్యత (Delhi Air Quality దారుణంగా పడిపోయింది. ఎయిర్ క్వాలిటీని "Very Poor" కేటగిరీలో చేర్చింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇవాళ ఉదయం (నవంబర్ 3) 7 గంటల నాటికి AQI 376గా నమోదైంది. చాలా చోట్ల కాలుష్యం అంచనాలకు మించి నమోదవుతోంది. అశోక్ విహార్ ప్రాంతంలో AQI 430గా ఉంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలోనే ఉంది. అందుకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వ్యాప్తంగా ప్రైమరీ స్కూల్స్‌ని రెండు రోజుల పాటు మూసేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ట్విటర్‌లో అధికారికంగా ప్రకటించారు. కాలుష్యం పెరుగుతున్న (Air Quality Levels) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో విపరీతమైన కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
"రోజురోజుకీ ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరుగుతోంది. ఇది దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్నాం. మరో రెండు రోజుల పాటు ప్రైమరీ స్కూల్స్‌ని మూసేయాలని ఆదేశించాం"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
అత్యవసర భేటీ..
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు. చాలా చోట్ల దుమ్ముని తగ్గించేందుకు పెద్ద పెద్ద ట్యాంకర్లతో నీళ్లు చల్లుతున్నారు. అయితే...రానున్న రోజుల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక Pollution Control Panel కూడా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. అత్యవసరం కాని నిర్మాణాల పనులు ఇప్పటికిప్పుడు ఆపేయాలని ఆదేశించింది. మైనింగ్ కూడా ఆపేయాలని స్పష్టం చేసింది. BS III పెట్రోల్ వాహనాలతో పాటు BS IV డీజిల్ ఫోర్ వీలర్స్‌ని ఢిల్లీ, గుడ్‌గావ్, ఫరియాబాద్, ఘజియాబాద్‌లోకి రానివ్వకుండా ఆంక్షలు విధించారు. దీంతో పాటు ఢిల్లీ పోలీసులు మరి కొన్ని చర్యలూ తీసుకుంటున్నారు. పదేళ్లు దాటిన వాహనాలు రోడ్లపైకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే అన్ని చోట్లా తనిఖీలు మొదలు పెట్టారు. గడువు చెల్లిన వాహనాలు తిరగకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే 175 వాహనాలను సీజ్ చేశారు.