Women Priests:



మహిళా అర్చకులు..


సనాతన ధర్మం వివాదం కొనసాగుతున్న సమయంలోనే తమిళనాడు ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ముగ్గురు మహిళలకు అర్చకత్వ పాఠాలు నేర్పి వాళ్లనే ఓ గుడిలో పూజారులుగా నియమించింది. Archakar Payirchi Palli ఇన్‌స్టిట్యూట్‌లో వాళ్లకు శిక్షణ అందించింది ప్రభుత్వం. తొలిసారి యువతులు ఈ కోర్స్‌ని ఎంపిక చేసుకుని చదువుకోవడమే కాకుండా ఉద్యోగమూ సంపాదించుకున్నారు. తిరుచ్చిరపల్లిలోని శ్రీరంగంలో Sri Ranganathar ఆలయం ఆధ్వర్యంలో ఈ ఇన్‌స్టిట్యూట్ నడుస్తోంది. తమిళనాడు ప్రభుత్వం వారికి సర్టిఫికేట్ అందించింది. లింగ సమానత్వానికి ఇదే నిదర్శనమని తేల్చి చెప్పారు స్టాలిన్. అసలు సిసలు సనాతన ధర్మం అంటే ఇదే అని పరోక్షంగా బీజేపీకి చురకలు అంటించారు. మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారని,అంతరిక్షంలోకీ వెళ్తున్నారని అయినా గుడిలో మాత్రం వాళ్లకి అర్చకత్వం చేసే అవకాశం కల్పించకపోవడం దారుణమని అన్నారు. ఈ ముగ్గురు మహిళలూ ఓ ఏడాది పాటు ఆలయంలో పని చేసి మరిన్ని నైపుణ్యాలు పెంచుకోనున్నారు. 






"లింగ సమానత్వానికి ఇదే నిదర్శనం. మహిళలు పైలట్‌లు, ఆస్ట్రోనాట్‌లు అవుతున్నారు. కానీ ఆలయాల్లో అర్చకత్వం చేయడానికి మాత్రం వాళ్లపై ఆంక్షలు విధించారు. మహిళలు అర్చకత్వం చేస్తే ఆలయం అపవిత్రమైపోతుందని ప్రచారం చేశారు. కానీ మేం ఆ అభిప్రాయాల్ని మార్చేశాం. మార్పు తీసుకొచ్చాం. ఇకపై మహిళలు కూడా ఆలయాల్లో మంత్రాలు చదువుతారు. అర్చకత్వం చేస్తారు. ద్రవిడయన్ మోడల్‌లో భాగంగా ఇప్పటికే అన్ని కులాల వారిని ఆలయాల్లో పూజారులుగా నియమించాం. ఇప్పుడు ఆ అవకాశాన్ని మహిళలకీ అందించాం"


- ఎమ్‌ స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి 






ఈ ముగ్గురిలో ఓ యువతి మ్యాథ్స్‌లో MSc చేసింది. బ్యాంకింగ్‌ జాబ్‌ సాధించాలనుకున్న ఆమె అర్చక ఇన్‌స్టిట్యూట్ నోటిఫికేష్ చూసి అప్లై చేసింది. తన ఇష్టంతోనే ఈ కోర్స్‌లో చేరినట్టు వెల్లడించింది. మొదట మంత్రాలు చదవడం చాలా కష్టంగా అనిపించిందని, తరవాత సులువుగానే నేర్చుకున్నానని తెలిపింది. సనాతన ధర్మంపై దేశవ్యాప్తంగా రాజకీయం వేడెక్కిన సమయంలో తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం కొత్త చర్చకు దారి తీసింది. ఇప్పటికే అన్ని కులాల వారికీ అర్చకత్వం చేసే హక్కు ఉందంటూ ప్రత్యేక పథకం ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ సారి మహిళలకూ అవకాశమిచ్చి సంచలనం సృష్టించింది. 


Also Read: Colonel Manpreet Singh: సెల్యూట్ నాన్న- కశ్మీర్‌ లో అమరుడైన కల్నల్‌ భౌతికకాయానికి కుమారుడి వీడ్కోలు