Colonel Manpreet Singh: కశ్మీర్ లో ఉగ్రమూకల కాల్పుల్లో అమరుడైన కల్నల్ మన్‌ప్రీత్‌ సింగ్ కుమారుడి వీడియో ఒకటి కన్నీరు తెప్పిస్తోంది. తన తండ్రికి ఆఖరి వీడ్కోలు పలుకుతున్న ఆ చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోంది. కశ్మీర్ లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో ఒకరైన కల్నల్ మన్‌ప్రీత్‌ సింగ్ మృతదేహం పంజాబ్ లోని మొహాలి జిల్లా ముల్లన్‌పూర్‌ లోని తన నివాసానికి చేరుకుంది. కల్నల్ మృతదేహానికి సైనికులు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ కుమారుడు కబీర్ సింగ్ సైనిక తరహా దుస్తులు ధరించి.. తండ్రి భౌతిక కాయానికి సెల్యూట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ముల్లన్‌పూర్‌ కు చేరుకున్న కల్నల్ భౌతిక కాయాన్ని సందర్శించడానికి ఆయన బంధుమిత్రులు, గ్రామస్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అంత్యక్రియల ఊరేగింపు ముల్లన్ పూర్ లోని కల్నల్ ఇంటి నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని బింజోల్ గ్రామానికి చేరుకోవడానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. దారివెంట ఆయన భౌతిక కాయానికి సందర్శకులు పూలు చల్లి సంతాపం తెలియజేశారు.






జమ్మూ కశ్మీర్ లోని అనంత్‌నాగ్‌లో జరిగిన ఉగ్రవాదులు దాడుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ ఎదురు కాల్పులు చేస్తున్న క్రమంలో ఆర్మీ కల్నల్ మన్‌ప్రీత్‌ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్‌చక్‌, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ హుమాయున్ భట్ లు అమరులయ్యారు. లష్కరే తోయిబాకు చెందిన షాడో గ్రూప్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇండియన్ ఆర్మీ. అనంత్‌నాగ్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే మరోసారి కాల్పులు, బాంబు పేలుళ్లు సంభవించాయి. అనంత్‌నాగ్‌లో తలదాచుకున్న ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టినట్టు ఆర్మీ స్పష్టం చేసింది. జవాన్లను బలి తీసుకున్న ఆ టెర్రరిస్ట్‌లను మట్టుబెట్టేందుకు చూస్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులయ్యారని, ఇందుకు కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఆర్మీ వెల్లడించింది. ఈ దాడులపై జమ్ములో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌కి చెందిన ఉగ్రవాదులే ఈ పని చేశారని, పాక్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఆందోళనకారులు. జమ్ములో భారతీయ జనత యువ మోర్ఛ ఆందోళన చేపట్టింది. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌పై దాడికి నిరసనగా నినాదాలు చేసింది. ఉగ్రవాదుల దిష్టిబొమ్మల్ని తగల బెట్టింది. అమరుల కుటుంబ సభ్యులు ఈ ఘటనను తట్టుకోలేకపోతున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. 


జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో సెక్యురిటీ సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య ప్రస్తుతం కూడా కాల్పులు  కొనసాగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి జరిగిన కాల్పుల్లో మరో  జవాను మృతిచెందారు. అయితే కొన్ని గంటల పాటు చనిపోయిన జవాను మృతదేహం లభ్యం కాలేదు. తర్వాత దొరికినట్లు తెలుస్తోంది. దీంతో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన అధికారుల సంఖ్య నాలుగుకు చేరింది. చనిపోయిన జవాను వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.