నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల భవనం నుంచి లిఫ్ట్‌ కూలిపోయి నలుగురు కార్మికులు మృతి చెందిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. ఆమ్రపాలి హౌసింగ్‌ సొసైటీకి చెందిన నిర్మాణంలో ఉన్న భవనంలో ఇది జరిగింది. 14వ అంతస్థు నుంచి సర్వీస్‌ లిఫ్ట్‌ కూలిపోయింది. అధికారులు ప్రమాద ప్రాంతంలో సహాయకచర్యలు చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఘటన జరిగినట్లు అడిషనల్‌ డీసీపీ (సెంట్రల్‌ నోయిడా) రాజీవ్‌ దీక్షిత్‌ వెల్లడించారు.


లిఫ్ట్‌ కూలిన సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఐదుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని గౌతమబుద్ధ నగర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ మనీష్‌ వర్మ వెల్లడించారు. నలుగురు వ్యక్తులు చనిపోయారు, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది, సిటీ హాస్పిటల్‌లో వైద్యం జరుగుతోంది. ఆస్పత్రిలో అధికారులు కూడా ఉన్నారు. సంఘటనా స్థలంలో కూడా అధికారులు ఉన్నారు, అక్కడ ఇంకెవ్వరూ చిక్కుకుపోలేదు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందిస్తున్నామని వర్మ తెలిపారు. 


ఇటీవల మహారాష్ట్రలో లిఫ్ట్‌ కూలి ఏడుగురు మృతి


మహారాష్ట్రలోని థానేలో నాలుగు రోజుల క్రితం సెప్టెంబరు 11న ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న లిఫ్ట్‌ కూలి ఏడుగురు కార్మికులు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. థానేలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం టెర్రస్‌పై వాటర్‌ ప్రూఫింగ్‌ పనులు పూర్తి చేసుకుని కార్మికులు కిందకు వస్తుండగా లిఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తి వైరు తెగిపోవడంతో కూలిపోయింది. లిఫ్ట్‌ వేగంగా కిందకు పడడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగింది కూడా పెద్ద హై రైజ్‌ బిల్డింగ్‌లోనే. లిఫ్ట్‌ ఏకంగా 40వ అంతస్థు నుంచి కూలిపోయి అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ ఏరియా P3 వద్ద పడినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.


ఇటీవల కాలంలో నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంతాలలో పెద్ద భవనాల్లో లిఫ్ట్‌ కూలిపోవడం, లిఫ్ట్‌లలో సమస్యలు తలెత్తడం వంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆగస్టులో నోయిడాలోని ఓ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో లిఫ్ట్‌ క్రాష్ అవ్వడంతో 73 ఏళ్ల మహిళ గుండెపోటుతో చనిపోయారు. ఈ ఘటనలో లిఫ్ట్‌ క్రాష్‌ అయ్యింది కానీ కింద నేలకు వచ్చి తగలలేదు. మధ్యలో ఏదో ఒక అంతస్థు వద్ద ఆగిపోయింది. కానీ ఆ మహిళ గుండెపోటుతో చనిపోయింది.