Delhi Crime News:



ఢిల్లీలో హత్య..


ఢిల్లీలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు ఓ మహిళను దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...మహమ్మద్ జాకీర్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో టెక్నికల్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. సహోద్యోగి నుంచి లోన్ తీసుకున్నాడు. చాన్నాళ్లుగా అది తిరిగి చెల్లించలేదు. సహనం కోల్పోయిన ఆ మహిళ డబ్బులు కట్టాలని నిలదీసింది. ఈ కోపంతోనే జాకీర్ ఆమె మెడపై కత్తితో పొడిచాడు. మెడపైనే చాలా సార్లు పొడిచిన గాయాలు కనిపించాయి. ఆ తరవాత ఆమె ముఖాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా యాసిడ్ పోశాడు. బాధితురాలు అదే రైల్వే స్టేషన్‌లో క్లర్క్‌గా పని చేస్తోంది. పర్సనల్‌ లోన్‌ కింద 2018,2019లో దాదాపు 11 లక్షల వరకూ ఇచ్చింది. వీటిని తీర్చలేక ఆమెను హత్య చేశాడు జాకీర్. మెట్రో స్టేషన్‌ వద్ద ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 8 వ తేదీ నుంచి తన తల్లి కనిపించడం లేదని బాధితురాలి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కంప్లెయింట్ ఆధారంగా విచారణ చేపట్టారు. సెప్టెంబర్ 9వ తేదీన ఓ వ్యక్తి ఫోన్ చేసి "మీ అమ్మ చనిపోయింది" అని చెప్పాడు. వెంటనే పోలీసులను అలెర్ట్ చేశారు కుటుంబ సభ్యులు. ఆ తరవాతే విచారణ మొదలు పెట్టి జాకీర్‌ని నిలదీశారు. సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 2 గంటలకు ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసింది బాధితురాలు. జాకీర్ ఆ రోజు సెలవు పెట్టాడు. అనుమానంతో పోలీసులు నిందితుడి ఫోన్‌ని ట్రాక్ చేశారు. స్విచ్ఛాఫ్‌ అవడం వల్ల లొకేషన్ ట్రేస్ చేయడం కష్టమైంది. దాదాపు 60 ప్రాంతాల్లో 20 గంటల పాటు తనిఖీలు చేసి చివరకు అరెస్ట్ చేశారు. డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేసినందుకే హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు.