అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి ఆందోళన బాటపట్టారు. అగ్రిగోల్డ్ బాధితుల చలో విజయవాడకు పిలుపునివ్వడంతో  పోలీసులు ఆంక్షలు విధించారు. ఏపీ నలుమూలల నుంచి వందలాది మంది విజయవాడకు చేరుకుంటున్నారు. దీంతో సంఘం నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రైళ్లలో వస్తున్న వారిని స్టేషన్‌లోనే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్లు, ఏజెంట్ల సంఘం నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, కోరాడ రాంబాబు, షరీఫ్‌ తదితరులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సెక్షన్ 144 తోపాటు పోలీస్ యాక్ట్ లోని సెక్షన్ 30 కింద కూడా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. వీటిని ఉల్లంఘించి ఎవరైనా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. శాంతి భద్రతలు, ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వలేదన్నారు.


రాష్ట్రంలో 32 లక్షల మంది కష్టార్జితాన్ని అగ్రిగోల్డ్‌ గజ దొంగలు దోచుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని... అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. అనందపురం మండలంలోనే సుమారు పదివేల మంది బాధితులు సుమారు రూ.3 కోట్లు పైన అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టారని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేతలు తెలిపారు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అగ్రిగోల్డ్ బాధితులు ప్రయత్నిస్తున్నారు. 


అగ్రిగోల్డ్‌ బాధితులు రాష్ట్రంలో 12 లక్షలు మంది ఉన్నారని సంఘం నేతలు చెబుతున్నారు. వీరి కుటుంబసభ్యులతో కలిపి 40లక్షలు మంది ఉన్నారని, గత 9 సంవత్సరాల నుంచి పోరాడి రూ. 10వేలు, 20వేలు రూపాయులు నగదును బాధితులకు ఇప్పించామన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు రూ. 40వేల కోట్లు ఉన్నా ఎందుకు ఇప్పించలేకపోయారని, దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.