వైసీపీని స్థాపించి...ఏళ్లు పూర్తయినా ప్రజలకు పార్టీ తెలియదా ? రెండు అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉపఎన్నికలు ఎదుర్కొంది వైసీపీ. అయితే ఉత్తరాంధ్రలోని పలు ప్రాతాల్లో వైసీపీ గుర్తు ఇప్పటికీ తెలియదట. చాలా మంది వైసీపీ గుర్తు అంటే సైకిల్ అంటున్నారట. ఇదే విషయాన్ని మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. 


ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గుర్తుపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని.. లేకపోతే దెబ్బ అయ్యే పరిస్థితి వస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని జ్యోతిబాపూలే కాలనీలో గురువారం 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తామని ఓటర్లు చెబుతున్నారని... గుర్తు మాత్రం సైకిల్‌కి వేస్తామని అంటున్నారని ధర్మాన వ్యాఖ్యానించారు. 


వచ్చే ఎన్నికల్లో జగన్‌ను మళ్లీ గెలిపిస్తారా..? అని వీధుల్లో ప్రజలను ప్రశ్నిస్తే... గెలిపిస్తాం అంటున్నారని తెలిపారు. ఓటు మాత్రం సైకిల్ గుర్తుకే వేస్తామంటున్నారని...ఇదే జరిగితే పార్టీకి పెద్ద దెబ్బేనని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తామని చెబుతూనే.. గుర్తు మాత్రం సైకిల్ అని అంటున్నారని గుర్తు చేశారు. వైసీపీ గుర్తుపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడా ఏమిటో ప్రజలు గ్రహించారన్న ధర్మాన, జగన్ పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు.