ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ బాటలో నడిచేందుకు మరో సీఎం సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమలులో ఉన్న గ్రామ సచివాలయాల వ్యవస్థను తమ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు స్టాలిన్ శుక్రవారం తెలిపారు.
కీలక ప్రకటన
గ్రామ సచివాలయాల ఏర్పాటును విడతల వారిగా చేపట్టనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. వీటిలో 600 ఈ ఏడాదికి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో సీఎం స్టాలిన్ వెల్లడించారు.
తొలిసారి
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థ అమలులో ఉంది. దేశంలోనే మొదటిసారిగా గ్రామ సచివాలయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి, తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ అదే ఏడాది అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడానికి ప్రయత్నిస్తోంది. 700 వందలకుపైగా సేవలను అందిస్తోంది. రాబోయే రోజుల్లో మరికొన్ని సేవల్ని అందబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ బియ్యం వంటి కార్యక్రమాలను దిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. పలు రాష్ట్రాలు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు తాజాగా తమిళనాడు గ్రామ సచివాలయ భవనాలు నిర్మించనున్నట్టు ప్రకటించింది.
Also Read: Karnataka: యువకుడ్ని చెంప దెబ్బ కొట్టిన ఎమ్మెల్యే- ఎందుకో తెలుసా?