ఐఐటీ మద్రాస్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అక్కడి విద్యార్థుల్లో మరో 18 మందికి కొవిడ్ నిర్ధరణయింది. గత 4 రోజుల్లో ఇక్కడ నమోదైన కేసుల సంఖ్య 30 దాటింది. దీంతో జీసీసీ (గ్రేటర్ చెన్నై కార్పొరేషన్) మొత్తం క్యాంపస్‌లో ఉన్న విద్యార్థులు, స్టాఫ్ అందరికీ పరీక్షలు నిర్వహిస్తోంది.


చాలా మంది విద్యార్థులకు కరోనా సోకడంతో కళాశాలలో జరిగే అన్నీ సాంస్కృతిక, అకడమిక్ ఈవెంట్లను వాయిదా వేస్తున్నట్టు ఐఐటీ మద్రాస్ అధికారులు వెల్లడించారు. రద్దీని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.


కరోనా సోకిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు వెల్లడించారు. కొంతమందికి గొంతు నొప్పి, ఒక విద్యార్థి జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. వీరంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. 


12 మందికి


ఐఐటీ మద్రాస్‌లో గురువారం 12 మందికి కరోనా సోకింది. దీంతో వారితో దగ్గరిగా ఉన్న విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు క్యాంపస్ సిబ్బంది తెలిపారు. ఈ విద్యార్థులను ఐసోలేషన్ కేంద్రాలకు తరలించినట్లు క్యాంపస్ సిబ్బంది తెలిపారు.


మాస్క్ తప్పనిసరి


తమిళనాడులో మాస్క్ తప్పనిసరి నిబంధనను తిరిగి అమల్లోకి తీసుకొస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిబంధనను తీసుకువచ్చింది. ఇక మాస్కు పెట్టుకోకపోతే రూ.500 జరిమానా చెల్లించాలని తెలిపింది. 


దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో మళ్లీ మాస్కు వినియోగం తప్పనిసరి చేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా నివారణకు ఫేస్ మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని చండీగఢ్, హరియాణా, పంజాబ్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు తెలిపాయి.


దేశంలో కొత్తగా 2,451 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 14,241కి చేరింది. నిన్నటి పోలిస్తే యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. మరణాల సంఖ్య 5,22,116కు పెరిగింది. కొత్తగా 54 మంది మృతి చెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 30 లక్షల 52 వేలు దాటింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.5 శాతానికి పైగా ఉంది.


Also Read: Karnataka: యువకుడ్ని చెంప దెబ్బ కొట్టిన ఎమ్మెల్యే- ఎందుకో తెలుసా?