Udhayanidhi Stalin appointed as Deputy CM of Tamil Nadu : చెన్నై: డీఎంకే యువనేత, మంత్రి ఉదయనిధికి ప్రమోషన్ లభించింది. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఆదివారం (సెప్టెంబర్ 29న) మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నైలోని రాజ్‌భవన్‌లో డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
తమిళ రాజకీయాల్లో మార్పులు తప్పవా!
తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ పార్టీలో కొత్త నాయకత్వాన్ని తేవాలని నిర్ణయించుకున్నారు. మంత్రిగా ఉన్న తన కుమారుడు ఉదయనిధిని ఇప్పటికే పాలిటిక్స్ లో ఆక్టివ్ చేశారు. ఇప్పుడు ఏకంగా డీఎంకే ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్ ఇస్తున్నారు. అమెరికా పర్యటన అనంతరం స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేపిస్తారని ఇటీవల బాగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంగా ఉదయనిధి నియామకంపై రాష్ట్ర గవర్నర్ కు లేఖ పంపగా ఆమోదం తెలిపారు. దాంతో పార్టీలో, ప్రభుత్వంలో స్టాలిన్ తరువాత ఉదయనిధి అని తాజా ప్రకటనతో కన్ఫర్మ్ అయింది.
తనను డిప్యూటీ సీఎంగా ప్రకటించిన అనంతరం ఉదయనిధి స్టాలిన్ తన తండ్రి, సీఎం స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయనిధి వెంట పార్టీ సీనియర్ నేతలు కొందరు వెళ్లారు. ఈ శుభసందర్భంగా స్వీట్లు పంచుకున్నారు.
సినిమా నుంచి రాజకీయాల్లోకి ఉదయనిధి
సినిమా హీరోగా ఆ తరువాత నిర్మాతగా మారారు ఉదయనిధి స్టాలిన్. ఈ క్రమంలో డీఎంకే యువజన విభాగానికి అధ్యక్షుడిగా పని చేసిన ఉదయనిధి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, తండ్రి స్టాలిన్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ప్రచార భారం ఆయనే మోశారు. యువతలో తనకంటూ గుర్తింపు ఉండటంతో, వచ్చే ఎన్నికల నాటికి సీఎం అభ్యర్థిగా సైతం ఉదయనిధిని తెరపైకి తేవాలని స్టాలిన్ భావిస్తున్నారని పార్టీలో వినిపిస్తోంది. గతంలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి లాంటి మాజీ సీఎంలు సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించారు. ఉదయనిధి సైతం అదే బాటలో పయనిస్తున్నారు.
సీఎం స్టాలిన్ ఒక్కసారే సీఎం అయ్యారు. ఎందుకంటే దశాబ్దాల నుంచి ఆయన తండ్రి కరుణానిధే డీఎంకే అధ్యక్షుడిగా కొనసాగారు. కరుణానిధి మరణానంతరం డీఎంకే ను గత ఎన్నికల్లో ముందుండి నడిపించిన స్టాలిన్ విజయం సాధించి తమిళనాడు సీఎం అయ్యారని తెలిసిందే. మరోవైపు వయసురీత్యా స్టాలిన్ డెబ్బై ఏళ్లు పైమాటే. దాంతో తన కుమారుడ్ని పార్టీలో కీలకంగా మార్చేందుకు సిద్ధం చేశారు. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో దళపతి విజయ్ పార్టీ, అన్నాడీఎంకేలను ఢీకొట్టేలా పార్టీని మరింత పటిష్టం చేసేందుకు యువనేత ఉదయనిధి స్టాలిన్ పై బాధ్యతలు పెంచుతున్నారు.