Stone on Rail track in UP: ఉత్తర్ ప్రదేశ్‌లో మరోసారి రైలు ప్రమాదం జరగాలని కుట్ర జరిగింది. లక్నో చాప్రా ఎక్స్‌ప్రెస్ వెళ్తున్న పట్టాలపై గుర్తు తెలియని దుండగులు రాయి పెట్టారు. లోకోపైలట్ గమనించి ఎమర్జెన్సీ బ్రేక్స్ అప్లై చేయడంతో ప్రమాదం తప్పింది. గత కొద్ది నెలలుగా యూపీ రైల్వే ట్రాక్‌లపై వరుసగా ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.


లోకో పైలట్ సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం:


ఉత్తర్‌ ప్రదేశ్‌లో గత ఆగస్టు నుంచి రైలు పట్టాలపై చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఇప్పటికే రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ ఉంచిన ఘటనలో పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకోగా మళ్లీ శనివారం నాడు మరో ఘటన జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో నుంచి బిహార్‌లోని చాప్రాకు వెళ్లే లక్నో చాప్రా ఎక్స్‌ప్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని కుట్ర జరిగినట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. బైరియా ప్రాంతానికి దగ్గర్లో రైల్వే ట్రాక్‌పై ఒక రాయి పెట్టి ఉండడాన్ని గమనించిన ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేక్‌ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రైలుకు ఏ విధమైన నష్టం వాటిల్లలేదని ఇన్‌స్పెక్షన్ అనంతరం రైలు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించిందని నార్త్ ఈస్ట్రన్ రైల్వే ప్రజా సంబంధాల అధికారి అశోక్‌ కుమార్ పీటీఐకి తెలిపారు. శనివారం ఉదయం పదున్నర గంటల ప్రాంతంలో వారణాశి- బలియా- చాప్రా రైల్వే సెక్షన్‌ పరిధి ట్రాక్‌పై ఈ ఘటన జరిగినట్లు ఆయన వివరించారు.


ఈ ఘటనకు సంబంధించి ట్రైన్‌కు ఏ విధమైన డ్యామేజ్ జరిగినట్లు లోకోపైలట్ రిపోర్టు చేయలేదన్నారు. ఈ రైలు వెళ్లడానికి కొన్ని నిమిషాల ముందే ఆ ట్రాక్‌పై ప్యాసింజర్ ట్రైన్ వెళ్లిందని.. ఆ తర్వాతే ఎవరో ట్రాక్‌పై రాయి పెట్టారని రైల్వే పోలీసుల  అనుమానిస్తున్నారు. బైరియా సర్కిల్ పోలీసులు కూడా ఈ ఘటనపై రైల్వే పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు. యూపీ బిహార్‌ బార్డర్‌కు కొద్ది దూరంలో ఉన్న బ్రిడ్జ్‌కు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి మాంఝీ రైల్వే బ్రిడ్జ్‌ 300 మీటర్ల దూరంలోనే ఉందని అన్నారు.


గత కొన్ని వారాలుగా యూపీ రైల్వే ట్రాక్‌పై వరుస ఘటనలు:






   పట్టాలపై ఐరన్ పోల్‌ను ఉంచిన దుండగులు      


సెప్టెంబర్ 18న నైని జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పడమే లక్ష్యంగా బిలాస్‌పూర్‌ రోడ్‌ అండ్‌ రుద్రపూర్ సిటీ జంక్షన్ మధ్య ఆరు మీటర్ల ఐరన్ పోల్‌ను పట్టాలపై పెట్టారు. అప్పుడు కూడా లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేక్స్ అప్లై చేసి కాపాడాడు. ఈ కేసులో ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సెప్టెంబర్‌ 22న గూడ్స్ రైల్‌ను డీరెయిల్‌ చేయడమే లక్ష్యంగా పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టారు. ఇక్కడ కూడా లోకో పైలట్ సమయస్ఫూర్తితో రైలు ప్రమాదం తప్పింది. సెప్టెంబర్ 8న కాళింది ఎక్స్‌ప్రెస్ డీరెయిల్ చేయడం కోసం ఇలాంటి పన్నాగమే జరిగింది. భివాని నుంచి ప్రయాగ్ రాజ్‌ వెళ్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపై ఎల్‌పీజీ సిలిండర్ ఉంచారు. ఇక్కడా లోకోపైలట్ కాపాడాడు. ఆగస్టు 17న ఇలాంటి ఘటనల కారణంగానే సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌ కాన్పూర్‌, భీమ్‌సేన్ స్టేషన్స్ మధ్యలో పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు.


Also Read: FIR Against Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు, ఎలక్టోరల్‌ బాండ్స్ స్కామ్‌లో లోకాయుక్త చర్యలు