Fir registered in Bangelore Polce station against Nirmala SitaRaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరు తిలక్ నగర్ స్టేషన్ లోకాయుక్త పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలతో నిర్మలా సీతారామన్ సహా కొందరు భాజపా జాతీయ స్థాయి నేతలతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసిన మరుసటి రోజే నిర్మలపై కూడా బెంగళూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్ రాయడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది.
నిర్మలమ్మపై నేరపూరిత కుట్రతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు:
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు పోలీసులు కేసు నమోదు చేసిన మరుసటి రోజే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరు తిలక్ నగర్ పోలీసు ఠాణాలో లోకాయుక్త పోలీసులు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు FIR రాశారు. ఈ రెండు ఘటనల్లో సామాజిక కార్యకర్తల పిటిషన్లపై ప్రజాప్రతినిధుల న్యాయస్థానం కేసులు వేయాలని ఆదేశించింది. శుక్రవారం నాడు నిర్మలమ్మపై 8 వేల కోట్ల రూపాయల బాండ్ల స్కామ్‌లో కేసు నమోదు చేయాలని లోకాయుక్త కోర్టు జడ్జి గజనాన్ ఆదేశించగా పోలీసులు శనివారం నాడు కేసు నమోదు చేశారు. నిర్మలా సీతారామన్‌పై పనిష్మెంట్ ఆఫ్ ఎక్స్టార్షన్- సెక్షన్ 384తో పాటు నేరపూరిత కుట్ర 120బి, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు, భాజపా రాష్ట్ర, జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్స్ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
అసలు వివాదం ఏంటి?
ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామిక వేత్తలను కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ బెదిరించి భారతీయ జనతా పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో భారీగా విరాళాలు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్ష్ పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యర్ కోర్టులో పిల్ వేశారు. ఆ పిల్‌పై విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఈ మేరకు కేంద్ర మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జస్టిస్ సంతోష్ గజనాన హెగ్గడే తిలక్ నగర్ ఠాణా పోలీసులను ఆదేశించారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ అక్టోబర్ 10కి వాయిదా పడింది. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా భాజపాకు 8 వేల కోట్ల రూపాయల నిధులు విరాళాలుగా రావడంలో నిర్మలా ప్రధాన నిందితురాలుగా అయ్యర్ తన పిల్‌లో పేర్కొన్నారు. ఆమెకు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సహకరించారని అన్నారు. అటు ఈ ఎలక్టోరల్ బాండ్స్ రైట్ టూ ఇన్ఫర్‌మేషన్ యాక్ట్‌కు, భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో మండిపడింది.
వరుస లోకాయుక్త కేసులపై కర్ణాటకలో రాజుకున్న రాజకీయ విమర్శలు:
వరుస రోజుల్లో రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్న వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరిపై కేసులు నమోదు కావడం రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలకు కారణం అవుతోంది. ముడా స్కాంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దంపతులతో పాటు ఆయన బావమరిది పేరున ఎఫ్‌ఐర్ ఫైల్ కావడంతో భాజపా సిద్ధరామయ్య రాజీనామాకు డిమాండ్ చేసింది. ఇంతలోనే నిర్మలపై కూడా కేసు నమోదు కావడంతో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే డిమాండ్ చేస్తోంది. అయితే కాంగ్రెస్ డిమాండ్‌పై స్పందించిన జేడీఎస్ నేత, కేంద్ర మంత్రి కుమారస్వామి, నిర్మల రిజైన్ చేయాల్సిన అవసరం లేదన్నారు. సిద్ధరామయ్య మాదిరి ఆమెపై వ్యక్తిగత అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలు లేవని చెప్పారు. అటు.. సిద్ధరామయ్యపై ఎఫ్‌ఐఆర్ నమోదైన వేళ కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు అనేక ఊహాగానాలకు కారణం అయ్యాయి. ఇవాళ ముఖ్యమంత్రిగా సిద్ధ ఉండొచ్చు రేపు ఎవరైనా ఉండొచ్చు, పార్టీ ముఖ్యం అంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.