Tomato Price in Tamilnadu:
రేషన్ షాప్‌లలో టమాటాలు
దేశవ్యాప్తంగా టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కిలో ధర రూ.150కి పెరిగింది. ధరలు తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈలోగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజూ ఎక్కువగా వినియోగించే టమాటాలను అందరికీ అందుబాటులో ఉంచాలని దాదాపు 50% మేర ధరలు తగ్గించింది. రేషన్ షాప్‌లలో మాత్రమే ఇది వర్తిస్తుంది. బియ్యం, పప్పు, నూనె ఎలాగైతే రేషన్ షాప్‌లలో చౌక ధరలకు లభిస్తాయో అలాగే టమాటాలనూ తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. చెన్నైలోని రేషన్ దుకాణాల్లో ఇది అమలు చేసింది ప్రభుత్వం. కిలో రూ.60కే విక్రయిస్తోంది. ముందుగా చెన్నైలోని రేషన్ షాప్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చి ఆ తరవాత రాష్ట్రవ్యాప్తంగా ఇది అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 82 రేషన్ షాప్‌లలో ఎక్కడైనా రూ.60కే కిలో టమాటాలు కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది.
"చెన్నైలోని 82 రేషన్ దుకాణాల్లో తక్కువ ధరకే టమాటాలు అందుబాటులో ఉంటాయి. కిలో రూ.60 మాత్రమే. దేశవ్యాప్తంగా వీటి ధరలు ఎలా పెరుగుతున్నాయో చూశాం. రైతులకు నష్టం రాకుండా నేరుగా మేమే కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నాం. వాటిని ఇలా సాధారణ పౌరుల కోసం రేషన్ దుకాణాల్లో విక్రయిస్తున్నాం"
- కేఆర్ పెరియకరుప్పన్, రాష్ట్రమంత్రి
సీజన్‌ల వారీగా టమాటా ధరలు పెరగడం, తగ్గడం సహజమే అని వెల్లడించింది ప్రభుత్వం. అయినా...ధరలు పెరిగితే వెంటనే వాటిని తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. టమాటాతో పాటు తమిళనాడులో మిర్చి ధరలు కూడా పెరిగాయి. కిలో పచ్చిమిర్చి రూ.160కి పెరిగింది. గత వారం కిలో ధర రూ.80-120 వరకూ ఉండేది.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ మహిళా రైతు టమాటా పండించింది. ధరలు పెరగడం వల్ల మంచి ఆదాయం వస్తుందని సంబర పడింది. పంటకోసి మార్కెట్‌కి తీసుకెళ్దామని చూసే లోపు ఒక్క కాయ కూడా కనిపించలేదు. అంతా దొంగల పాలైంది. దాదాపు రూ.2.5 లక్షల విలువైన టమాటాలను ఎత్తుకెళ్లారు దుండగులు. టమాటా సాగు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నానని, వాటిని ఎలా కట్టాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు.
"పంట సాగు కోసం చాలా ఖర్చు చేశాం. లోన్‌లు తీసుకొచ్చాం. పంట దిగుబడి బాగుంది. ధరలూ పెరిగాయి. కానీ పొలంలో దొంగలు పడ్డారు. 50-60 బ్యాగుల టమాటాలు తీసుకెళ్లడమే కాకుండా పక్కనున్న పంటనూ నాశనం చేశారు"
- మహిళా రైతు, బాధితురాలు
Also Read: Chandrayaan 3 Launch: చంద్రయాన్-3 ప్రయోగానికి డేట్, టైం ఫిక్స్ - ఇస్రో అధికారిక ప్రకటన