Maharashtra NCP Crisis: 



పోస్టర్ వార్..


NCP నేతలంతా ఢిల్లీలో సమావేశం కావాలని శరద్ పవార్ పిలుపునిచ్చారు. పార్టీ పేరుని, గుర్తుని అజిత్ పవార్‌కి కేటాయించకుండా న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ భేటీకి ముందు నుంచే ఢిల్లీలో పోస్టర్ వార్ మొదలైంది. పార్టీ ఆఫీస్ బయట శరద్ పవార్, సుప్రియా సూలే పోస్టర్లు వెలిశాయి. అంతకు ముందు అజిత్ పవార్, సుప్రియా సూలే, శరద్ పవార్‌ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు, పోస్టర్‌లను తొలగించారు. అజిత్ పవార్ ఫొటోలు తీసేసి కేవలం శరద్ పవార్, సుప్రియా సూలే ఫోటోలను మాత్రమే ఉంచారు. 
"అబద్ధానికి, నిజానికి జరిగే యుద్ధంలో దేశ ప్రజలంతా శరద్ పవార్‌తోనే ఉంది. వెన్నుపోటు పొడిచిన వాళ్లను క్షమించరు. భారత్ చరిత్ర అలాంటిది" అని ఆ పోస్టర్‌లపై రాసి ఉంది. శరద్ పవార్‌కి స్వాగతం చెబుతూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలనూ ఏర్పాటు చేశారు ఆయన మద్దతుదారులు. ఇవే కాదు. అజిత్ పవార్‌పై నిరసన వ్యక్తం చేస్తూ మరి కొన్ని పోస్టర్లనూ అంటించారు. అజిత్ పవార్‌ ఓ మోసగాడు అంటూ ఆ పోస్టర్లలో రాశారు. బాహుబలి సినిమాలో కట్టప్ప అమరేంద్ర బాహుబలికి వెన్నుపోటు పొడిచిన పోస్టర్‌నీ అంటించారు. కట్టప్పని అజిత్‌ పవార్‌తో పోల్చుతూ...శరద్ పవార్‌కి ఆయన వెన్నుపోటు పొడిచారని మండి పడ్డారు. 










స్పెషల్ మీటింగ్స్..


ముంబయి వేదికగా ఇప్పటికే శరద్ పవార్, అజిత్ పవార్ వేరు సమావేశాలు నిర్వహించారు. అజిత్ క్యాంప్‌లో దాదాపు 32 మంది ఎమ్మెల్యేలు హాజరు కాగా...14 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ భేటీకి హాజరయ్యారు. సంఖ్యాపరంగా చూస్తే ప్రస్తుతానికి అజిత్ పవార్‌కే ఎక్కువ బలం ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ...చివరి వరకూ ఆయన క్యాంప్‌లో ఎంత మంది ఉంటారన్నది తేలాల్సి ఉంది. అయితే...అజిత్ పవార్‌ వర్గంలోని ఆ 32 మంది ఎమ్మెల్యేలపైనా అనర్హతా వేటు వేయాలని శరద్ పవార్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కింద వాళ్లకు ఆ శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అజిత్ పవార్ మాత్రం "మెజార్టీ నాదే" అని తేల్చి చెబుతున్నారు. NCP పార్టీ పేరుని, గుర్తుని వినియోగించుకునే హక్కు తనకే ఉందని స్ఫష్టం చేశారు. 83 ఏళ్ల వయసులో కూడా ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి ఏం చేస్తారు..? అంటూ శరద్ పవార్‌కే చురకలు అంటించారు. 


Also Read: రాజస్థాన్‌పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్, సచిన్ పైలట్‌ మనసు మార్చుకున్నట్టేనా?