Rajasthan Elections:
కీలక సమావేశం
కాంగ్రెస్ హైకమాండ్ రాజస్థాన్ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో సచిన్ పైలట్, అశోక్ గహ్లోట్ మధ్య విభేదాలు ఉండటం మంచిది కాదని భావిస్తోంది అధిష్ఠానం. వీలైనంత త్వరగా దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలని చూస్తోంది. ఢిల్లీలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ఈ సమావేశంలో సచిన్ పైలట్ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. అంతర్గత విభేదాలకు పరిష్కారం చూపించడంతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చ జరిగినట్టు సమాచారం. సీఎం అశోక్ గహ్లోట్‌కి ఇటీవలే మైనర్ సర్జరీ జరిగింది. అందుకే..ఆయన వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలోని నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఖర్గే. ఇప్పుడు రాజస్థాన్‌పై దృష్టి పెట్టారు. అయితే...సచిన్ పైలట్ ఈ మధ్య కాలంలో హైకమాండ్‌కి వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేసి ఓ రోజంతా నిరసన దీక్ష చేపట్టారు. ఆ తరవాత ఆయన కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు వినిపించినా...అవన్నీ పుకార్లేనని కాంగ్రెస్ నేతలు తేల్చి చెప్పారు. కేవలం పార్టీ పట్ల ఉన్న గౌరవంతోనే వెనక్కి తగ్గినప్పటికీ..డిమాండ్‌ల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు సచిన్ పైలట్. అవినీతి జరుగుతున్నా పట్టనట్టు ఉంటున్నారని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్‌పై విమర్శలు చేస్తున్నారు పైలట్. అంతే కాదు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో చాలా సంస్కరణలు తీసుకురావాలని చెబుతున్నారు.
వీడని సమస్యలు..
సరిగ్గా ఈ భేటీ జరిగే రెండ్రోజుల ముందే అశోక్ గహ్లోట్ కీలక ప్రకటన చేశారు. ఎగ్జామ్ పేపర్‌లు లీక్ చేసే వారికి కనీసం 10 ఏళ్లు జైలు శిక్ష పడేలా ఓ బిల్‌ని త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడతామని వెల్లడించారు. మే నెల నుంచే గహ్లోట్ వర్సెస్ పైలట్ ఫైట్‌కి శుభం కార్డు వేయాలని ఖర్గే, రాహుల్ ప్రయత్నిస్తున్నారు. ఆ తరవాతే సచిన్ పైలట్, అశోక్ గహ్లోట్ కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించారని, వాళ్లిద్దరి దారులూ ఒకటే అని కాంగ్రెస్ ప్రకటించింది. ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. 2018లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అశోక్ గహ్లోట్‌ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. సచిన్ పైలట్‌తో విభేదాలు ముదిరాయి. 2020లో పైలట్...గహ్లోట్‌పై తిరుగుబాటు చేశారు. ఆ తరవాతే హైకమాండ్ ఆయనను డిప్యుటీ సీఎం పదవి నుంచి తొలగించింది. అప్పటి నుంచి సీఎం సీట్ కోసం ఆరాట పడుతున్నారు సచిన్ పైలట్. సీనియర్లను పక్కన పెట్టి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే హైకమాండ్ మాత్రం అశోక్ గహ్లోట్‌ని వదులుకోడానికి ఆసక్తి చూపించడం లేదు. సీఎం కుర్చీలో ఆయనే ఉండాలని పట్టుపడుతోంది. ఎన్నో ఏళ్లుగా పార్టీకి విధేయుడిగా ఉంటున్న గహ్లోట్‌ని అవమానించలేమని తేల్చి చెబుతోంది.
Also Read: యునిఫామ్ సివిల్ కోడ్‌ని ముస్లింలంతా వ్యతిరేకిస్తున్నారా? ABP News సర్వేలో ఆసక్తికర విషయాలు