Uniform Civil Code:



ABP టీమ్ సర్వే..


యునిఫామ్ సివిల్‌ కోడ్‌పై దేశవ్యాప్తంగా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మూడు గంటల పాటు చర్చించింది. UCCని వ్యతిరేకిస్తున్నట్టు తీర్మానించింది. అయితే...ఇది కేవలం ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అభిప్రాయం మాత్రమే. దేశంలోని ముస్లింలు దీనిపై ఏమనుకుంటున్నారో ABP News సర్వే చేపట్టింది. వాళ్లు కూడా అదే స్థాయిలో వ్యతిరేకిస్తున్నారా..లేదంటే స్వాగతిస్తున్నారా అన్నది ఈ సర్వేలో తేలింది. ఈ సర్వేలో భాగంగానే ABP News టీమ్ యూపీలోని షమ్లీ ప్రాంతానికి వెళ్లింది. 2011 జనాభా లెక్కల ప్రకారం షమ్లీలో 67% మంది హిందువులు కాగా..32% మంది ముస్లింలు ఉన్నారు. ఇక్కడ కలంద్‌షహర్ మొహల్లాలో సర్వే చేపట్టింది ABP టీమ్. ఇక్కడి మహిళలు రోజంతా కష్టపడి సంపాదించేది కేవలం రూ.60 మాత్రమే. ఇక పురుషులు రిక్షా తొక్కుతూ రోజుకి రూ.300 సంపాదిస్తున్నారు. అత్యంత సాధారణ కుటుంబంలోని వీళ్లని యునిఫామ్ సివిల్ కోడ్‌పై అభిప్రాయాల్ని అడిగింది ABP News. ముందుగా ఏ వయసులో పెళ్లి చేసుకోవాలని అడగ్గా...20 ఏళ్ల లోపు ముస్లిం అమ్మాయిలు కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెప్పారు. ఇక పిల్లల విషయానికొస్తే..ఎక్కువ మందిని కనకుండా ఇద్దరు లేదా ముగ్గురినే కనాలని నిబంధన పెట్టినా పరవాలేదని అన్నారు. ముగ్గురే ఎక్కువ అని అంత కన్నా ఎక్కువ అవసరం లేదని కొందరు చెప్పారు. 


హలాలాపై..


హలాలా (Halala) గురించి కూడా ముస్లిం మహిళలను ABP News టీమ్ ప్రశ్నించింది. UCC అమల్లోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేసే అవకాశాలున్నాయి. ఇస్లాం మతాచారాల ప్రకారం ఓ భర్త తన భార్యకు విడాకులిచ్చే..మళ్లీ మనసు మార్చుకుని అదే మహిళను పెళ్లి చేసుకోవాలనుకుంటే..అప్పుడు ఆ మహిళ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులిచ్చి..మొదటి భర్తను వివాహమాడాలి. మొదటి భర్తను పెళ్లి చేసుకోవాలంటే..కచ్చితంగా మరో పురుషుడిని పెళ్లి చేసుకుని విడాకులివ్వాల్సి ఉంటుంది. దీనిపై ముస్లింలలో కొందరు సానుకూలంగా ఉంటే మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇదో క్రూరమైన నిబంధన అని విమర్శిస్తున్నారు. అయినా...మతాచారాన్ని పాటించక తప్పదని స్పష్టం చేస్తున్నారు. మహిళల గౌరవాన్ని కించపరుస్తోందని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూసీసీ వచ్చాక హలాలాపై నిషేధం విధించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కొందరు మహిళలు చెప్పారు. అయితే...మహిళలకు విడాకులిచ్చే హక్కుని అంత సులువుగా ఇచ్చేస్తే చాలా సమస్యలొస్తాయని, లేనిపోని కారణాలకూ విడాకులిచ్చే ప్రమాదముందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకే...ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. 


మదర్సాల్లోనూ సర్వే..


ఇదే క్రమంలో కొన్ని మదర్సాల్లోనూ సర్వే నిర్వహించింది ABP టీమ్. విడాకులు తీసుకోవడం అందరి హక్కు అని, దాన్ని పురుషులకే పరిమితం చేయడం సరికాదని కొందరు టీచర్‌లు అభిప్రాయపడ్డారు. ఇక సంతానం విషయానికొస్తే...జనాభాను నియంత్రణ పెట్టడం సరికాదని అది దేవుడు ఇచ్చిన కానుక అని తేల్చి చెబుతున్నారు. ఇక ఇస్లాంలోని మరో ఆచారం ఇద్దత్ (Iddat)పైనా అభిప్రాయాలు సేకరించింది ABPP News. భర్త చనిపోయి తరవాత ముస్లిం మహిళ మూడు నెలల వరకూ బయటకు రాకూడదు. పరాయి మగాడి ముందు నిలుచోకూడదు. దాదాపు 10 నెలల పాటు ఐసోలేటెడ్‌గానే బతకాలి. యూసీసీ వస్తే ఈ నిబంధనా తొలగిపోతుంది. దీనిపైనా ముస్లింలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే..యునిఫామ్ సివిల్‌ కోడ్‌పై అన్ని చోట్లా వ్యతిరేకత లేదు. అలా అని సానుకూలతా లేదు. 


Also Read: Kids In Earlier Age: ఏపీలో పాతికేళ్లకే ఇద్దరు పిల్లలు- జాతీయ సగటు 30 సంవత్సరాలు- మారుతున్న ట్రెండ్‌