Tomatoes Stolen:
రూ.2.5 లక్షల విలువైన టమాటాలు చోరీ..
దేశవ్యాప్తంగా టమాటా ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. ఎప్పుడూ ఊహించనంతగా కిలో రూ.150కి పైగానే పలుకుతోంది. మిగతా కూరగాయల ధరలూ అంతే ఉన్నా...టమాటా ఆ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. అంత రేట్ పెట్టి కొనాలంటే జనాలు ఉసూరుమంటున్నారు. తప్పక కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది మాత్రం ఇదే అదనుగా చేతి వాటం చూపిస్తున్నారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ మహిళా రైతు టమాటా పండించింది. ధరలు పెరగడం వల్ల మంచి ఆదాయం వస్తుందని సంబర పడింది. పంటకోసి మార్కెట్‌కి తీసుకెళ్దామని చూసే లోపు ఒక్క కాయ కూడా కనిపించలేదు. అంతా దొంగల పాలైంది. దాదాపు రూ.2.5 లక్షల విలువైన టమాటాలను ఎత్తుకెళ్లారు దుండగులు. టమాటా సాగు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నానని, వాటిని ఎలా కట్టాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు.
"పంట సాగు కోసం చాలా ఖర్చు చేశాం. లోన్‌లు తీసుకొచ్చాం. పంట దిగుబడి బాగుంది. ధరలూ పెరిగాయి. కానీ పొలంలో దొంగలు పడ్డారు. 50-60 బ్యాగుల టమాటాలు తీసుకెళ్లడమే కాకుండా పక్కనున్న పంటనూ నాశనం చేశారు"
- మహిళా రైతు, బాధితురాలు
మహబూబాబాద్‌లోనూ..
2 ఎకరాల్లో పంట సాగు చేసింది మహిళా రైతు. సరిగ్గా పంట కోతకు వచ్చే సమయానికే ఒక్క కాయ కూడా లేకుండా దొంగలు అంతా ఊడ్చేశారు. బెంగళూరులో టమాటా కిలో ధర రూ.120గా ఉంది. ప్రస్తుతానికి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు, ఆ దొంగల్ని పట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తోంది. కర్ణాటకలోనే కాదు. తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని మార్కెట్‌లో టమాటాతో పాటు పచ్చిమిర్చి బాక్సులు చోరీకి గురయ్యాయి. అక్కడే ఉన్న సీసీటీవీని పరిశీలించిన పోలీసులు దొంగతనం జరిగిందని వెల్లడించారు.
గత కొంత కాలంగా టమాటా ధర రోజురోజుకూ పెరిగిపోతుంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూరగాయలు ధరలు విపరీతంగా పెరగడంతో.. సామాన్య ప్రజలు కన్నీళ్లు పెడుతున్నారు. రోజూ ఏం వండుకోవాలో తెలియకు.. కారం మెతుకులతోనే పూట గడిపేస్తున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాల కారణంగా రవాణాకు తీవ్ర అంతరాయం కల్గడంతో మెట్రో నగరాల్లో టమాటా ధరలు మరింత అధికం అయ్యాయి. కోల్ కతాలో కిలో టమాటా ధర రూ.155కు చేరగా.. ముంబయిలో రూ.58, ఢిల్లీలో రూ.110, చెన్నైలో రూ.117గా టమాటా ధరలు ఉన్నాయి. కేంద్ర వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దేశంలో టమాటా సరాసరి ధర కిలోకు రూ.83.29గా ఉంది. బీహార్ రాజధాని పాట్నాలో క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలు కిలో రూ.60 చొప్పున లభిస్తున్నాయి. ఇదొక్కటే కాదు పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కూడా కూరగాయల ధరల విపరీతంగా పెరిగాయి.
Also Read: Vande Bharat Express: వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ రూట్‌లలో తగ్గబోతున్న టికెట్ ధరలు !