వందేభార‌త్ రైలు ప్ర‌యాణికులు త్వ‌ర‌లో తీపి క‌బురు వినబోతున్నారు. త‌క్కువ ఆక్యుపెన్సీ ఉన్న వందేభార‌త్ రైళ్ల రూట్ల‌లో టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించేందుకు రైల్వే శాఖ యోచిస్తోంది. త‌ద్వారా టికెట్ ధ‌ర‌ల‌ను ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి తీసుకువచ్చి, ఆక్యుపెన్సీని పెంచుకోవాల‌ని భావిస్తోంది. 200 నుంచి 300 కి.మీ. ప‌రిధిలో నడుస్తున్న త‌క్కువ ఆక్యుపెన్సీ ఉన్న వందేభార‌త్ రైళ్ల‌లో 5-10 శాతం వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.  


త‌క్కువ ఆక్యుపెన్సీ ఉన్న రూట్లు ఇవే..
ఇటీవ‌ల ప్రారంభించిన నాలుగు వందేభార‌త్ రూట్ల‌లో త‌క్కువ ఆక్యుపెన్సీ ఉంది. ఇండోర్ - భోపాల్‌, మ‌డ్‌గోన్ - ముంబ‌యి, జ‌బ‌ల్‌పూర్ - భోపాల్ రూట్ల‌లో మ‌రీ త‌క్కువగా 21 శాతం నుంచి 55 శాతం వ‌ర‌కు ఆక్యుపెన్సీ ఉంది. జూన్‌ నెలకు సంబంధించి ఆయా రైళ్ల ఆక్యుపెన్సీని పరిశీలిస్తే.. భోపాల్‌- ఇండోర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కేవలం 29 శాతం, ఇండోర్‌- భోపాల్‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేవలం 21 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే నమోదు చేశాయి. భోపాల్‌- జబల్‌పుర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రూటులో 32 శాతం ఆక్యుపెన్సీ ఉంది. జబల్‌పుర్‌- భోపాల్‌ వందే భారత్‌ ఆక్యుపెన్సీ రేషియో 36శాతంగా ఉంది. ఈ రూట్‌లో కూడా టికెట్‌ ధరలు తగ్గించే అవకాశం ఉంది. 


చాలా వ‌ర‌కు 100 శాతం ఆక్యుపెన్సీతో..
దేశంలో చాలా వందే భారత్‌ రైళ్లు 100శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయ‌ని, కొన్ని మాత్రమే తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయ‌ని ఓ సీనియ‌ర్ అధికారి తెలిపారు. ముఖ్యంగా తక్కువ ప్రయాణ సమయం ఉన్న రైళ్లలో టికెట్‌ ధరలు తగ్గిస్తే మరింత ఆదరణ సొంతం చేసుకుంటాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.  


ఆక్యుపెన్సీ విషయంలో కాసర్‌గోడ్‌-త్రివేండ్రం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అగ్రస్థానంలో ఉంది. 183 శాతం ఆక్యుపెన్సీతో అన్ని రైళ్ల కంటే ముందుంది. త్రివేండ్రం- కాసర్‌గోడ్‌ (176 శాతం), గాంధీనగర్‌- ముంబయి సెంట్రల్‌ (134 శాతం), ముంబయి సెంట్రల్‌ - గాంధీనగర్‌ (129 శాతం), వారణాశి - న్యూదిల్లీ (128 శాతం), న్యూదిల్లీ - వారణాశి (124 శాతం), డెహ్రాడూన్- అమృత్‌సర్ (105 శాతం), ముంబయి- షోలాపూర్‌ (111 శాతం), షోలాపూర్‌- ముంబయి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (104 శాతం) ఆక్యుపెన్సీ పరంగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక స్టేషన్‌ నుంచి ఒక స్టేషన్‌కు తీసుకునే టికెట్‌ను ఒక బుకింగ్‌గా, అక్కడి నుంచి మరో స్టేషన్‌ వరకు టికెట్‌ జారీ అయితే రెండో బుకింగ్‌గా లెక్కిస్తారు.


రేపటి నుంచి విజయవాడ చెన్నై మధ్య వందేభారత్‌


విజయవాడ నుంచి చైన్నై మధ్య శుక్రవారం నుంచి రాకపోకలు సాగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఐదు వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అందులో విజయవాడ నుంచి చెన్నై మధ్య నడిచే రైలు కూడా ఉంటుందని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులకు సమాచారం అందింది.


విజయవాడ, చెన్నై మధ్య నడిచే  ట్రైన్ ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఈనెల 8వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలు సాగుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన రాకపోకల, షెడ్యూల్, టిక్కెట్ ధరలు గురించి ఒకటి లేదా రెండు రోజుల్లో బయటకు రానున్నాయి. ఈ రైలును రేణిగుంట మీదుగా నడపాలని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు కోరినట్టు తెలిసింది. ఆ ప్రకారం విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదుగా చైన్నై వెళ్లి.. అదే మార్గంలో తిరిగి రానుంది. విజయవాడ నుంచి తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, వందేభారత్ ను రేణిగుంట మీదుగా నడపాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినట్ుల విజయవాడ డివిజన్ రైల్వే అధికారి తెలిపారు.